‘కోవిడ్‌ టీకాతో నపుంసకులవుతారు’

15 Jan, 2021 09:08 IST|Sakshi

సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు

ఖండించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

ఇవన్ని ఊహాగానాలు.. జనాలు వీటిని పట్టించుకోవద్దు: హర్షవర్ధన్‌

లక్నో: మరో 24 గంటల్లో కేంద్రం కరోనా వైరస్‌ను తుదముట్టించే వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. అయితే దీనిపై ఇప్పటికే ప్రజల్లో పలు సందేహాలు నెలకొనగా.. రాజకీయ నాయకులు తమ వ్యాఖ్యలతో ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌ సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్‌ యాదవ్‌ కరోనా వ్యాక్సిన్‌ బీజేపీది కాబట్టి.. తాను దాన్నితీసుకోనని పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి అదే పార్టీ ఎమ్మెల్సీ మరొకరు చేరారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకుంటే నపుంసకులు అవుతారంటూ సదరు ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు చేశారు. (చదవండి: మా డౌట్లు తొలగించండి )

ఆ వివరాలు.. సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సే అశుతోష్ సిన్హా మాట్లాడుతూ.. ‘మేం కేం‍ద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీని నమ్మం. మా నాయకుడు అఖిలేష్‌ యాదవ్‌ వ్యాక్సిన్‌ తీసుకోనంటున్నారంటే.. వ్యాక్సిన్‌ విషయంలో ఆయనకు ఏవైనా వాస్తవాలు తెలిసి ఉంటాయని నా నమ్మకం. ఈ వ్యాక్సిన్‌ ప్రజలకు హానీ చేస్తుంది. కోవిడ్‌ టీకా‌ తీసుకుంటే నపుంసకులవుతారు. మా నాయకుడు అఖిలేష్‌ యాదవ్‌ వ్యాక్సిన్‌ వద్దు అన్నాడంటే.. కేవలం మా పార్టీ కార్యకర్తలు మాత్రమే కాక రాష్ట్ర ప్రజలందరు టీకాకు దూరంగా ఉండాలి’ అంటూ అశుతోష్‌ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజల్లో టీకా పట్ల భయాలు నెలకొనడంతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ స్వయంగా రంగంలోకి దిగి, అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు. (చదవండి: ‘అపోహలు‌ ఉంటే పాకిస్తాన్‌లో వ్యాక్సిన్‌ వేయించుకోండి )

కరోనా టీకా వలన నపుంసకులు అవుతారంటూ వినిపిస్తున్న ఊహాగానాలను హర్షవర్ధన్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘కరోనా టీకా కారణంగా మహిళలు గానీ, పురుషులు గానీ నపుసంకులు అవుతారని శాస్త్రవేత్తలెవరూ చెప్పలేదు. ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు కూడా లేవు. నిరాధానమైన ఇటువంటి ఊహాగానాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అన్నారు హర్షవర్ధన్‌. అయితే కోవిడ్ టీకా వేయించుకున్న తరువాత కొద్దిమందిలో స్వల్ప జ్వరం, టీకా వేయించుకున్న ప్రాంతంలో నొప్పి ఉంటుందని అన్నారు. ఇతర టీకాలు వేయించుకున్నప్పుడు కూడా ఇదేవిధంగా జరుగుతుందన్నారు. కొద్ది సేపటిలోనే ఇటువంటి సమస్యలు మాయయవుతాయని స్పష్టం చేశారు. ఇక రేపటి నుంచి దేశవ్యాప్తంగా కరోనా టీకా వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ప్రతి కేంద్రంలో 100 మందికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. 

మరిన్ని వార్తలు