అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో చూడండి?: సమాజ్‌వాది పార్టీ

24 Sep, 2022 13:52 IST|Sakshi

లక‍్నో: శాసనసభా సమావేశాలు రాష్ట్రం, ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అధికార, విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు తమ వంతు పాత్ర పోషించి.. తీసుకునే నిర్ణయాల్లో భాగమవుతారు. అయితే, కొందరు ఎమ్మెల్యేలు అశ్రద్ధగా వ్యవహరిస్తూ విమర్శల పాలవుతున్నారు. మనకేందుకులే అనుకుని నిద్రపోయిన ఎమ్మెల్యేల సంఘటనలు చాలానే చూసుంటాం. అయితే, ఓవైపు కీలక చర్చ జరుగుతుండగా కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు తమకేమి పట్టనట్టు ఫోన్లలో వీడియో గేమ్స్‌ ఆడటంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీలో జరిగింది. ఎమ్మెల్యేలకు సంబంధించిన రెండు వీడియోలను సమాజ్‌వాది పార్టీ శనివారం ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. 

‘ఈ వ్యక్తులు ప్రజల సమస్యలకు సమాధానం చెప్పరు. అసెంబ్లీని ఒక వినోద హబ్‌గా మార్చేశారు. ఇది చాలా నీచమైన, అవమానకరమైన చర్య.’ అంటూ పేర్కొంది ఎస్పీ పార్టీ. సమాజ్‌వాది పార్టీ షేర్‌ చేసిన వీడియోలు సోషల్‌ మీడియలో వైరల్‌గా మారాయి. మొదటి వీడియోలో.. మొహబా ఎమ్మెల్యే రాకేశ్‌ గోస్వామి తన మొబైల్‌ ఫోన్‌లో కార్డ్స్‌ గేమ్‌ ఆడుతున్నారు. మరోవైపు సభ జరుగుతున్నట్లు మాటలు, చప్పట్లు స్పష్టంగా వినిపిస్తున్నాయి. రెండో వీడియోలో.. ఝాన్సీ ఎమ్మెల్యే రవి శర్మ అసెంబ్లీలో కూర్చుని పోగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. డెస్కు నుంచి రాజ్‌నిగంధ బాక్స్‌ను బయటకు తీస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.

ఇదీ చదవండి: ఐరాస వేదికగా పాక్‌ పీఎం ‘శాంతి’ మాటలు.. స్ట్రాంక్‌ కౌంటర్‌ ఇచ్చిన భారత్‌

మరిన్ని వార్తలు