Sameer Wankhede: మా నాన్న హిందు, అమ్మ ముస్లిం..

25 Oct, 2021 20:07 IST|Sakshi

ఎన్‌సీబీ ముంబై జోనల్‌ చీఫ్‌ సమీర్‌ వాంఖెడే

మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ ఆరోపణలకు కౌంటర్‌

ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారని ఆవేదన

ముంబై: తన మతంపై రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణలపై నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ముంబై జోనల్‌ చీఫ్‌ సమీర్‌ వాంఖెడే స్పందించారు. ముంబై క్రూయిజ్‌ మాదక ద్రవ్యాల కేసు దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తున్న సమీర్‌ వాంఖెడేపై మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నాయకుడు నవాబ్‌ మాలిక్‌ పలు ఆరోపణలు చేశారు. సమీర్‌.. ముస్లిం మతానికి చెందినవారని పేర్కొంటూ ఒక డాక్యుమెంట్‌ను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘ఫోర్జరీ ఇక్కడ నుంచి ప్రారంభమైంది’ అంటూ క్యాప్షన్ తగిలించారు. అంతేకాదు సమీర్‌, ఆయన మాజీ భార్య షబానా ఖురేషీ పెళ్లి నాటి ఫొటో కూడా ట్విటర్‌లో పెట్టారు. దీనిపై సమీర్‌ దీటుగా స్పందించారు. 


నవాబ్‌ మాలిక్‌ ట్విటర్‌లో షేర్‌ చేసిన ఫొటోలు

అనవసర విషయాల్లో తనను ఇరికిస్తున్నారని, తనకు సంబంధించిన ఏ వివరాలైనా పరిశీలించుకోవచ్చని సమీర్‌ వాంఖెడే స్పష్టం చేశారు. ‘నా తండ్రి పేరు ద్యాన్ దేవ్ కచ్రుజీ వాంఖెడే. 2007 జూన్‌ 30న స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా ఆయన పదవీ విరమణ చేశారు. నా తండ్రి హిందువు. నా తల్లి దివంగత శ్రీమతి జహీదా ముస్లిం. బహుళ మత, లౌకిక కుటుంబానికి చెందినవాడిగా.. నా వారసత్వం గురించి నేను గర్విస్తున్నాను. నేను డాక్టర్ షబానా ఖురేషీని 2006లో ప్రత్యేక వివాహ చట్టం, 1954 ప్రకారం వివాహం చేసుకున్నాను. మేమిద్దరం 2016లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం.  2017లో, నేను షిమాతి క్రాంతి దిననాథ్ రెడ్కార్‌ను వివాహం చేసుకున్నాను’ అని సమీర్‌ వాంఖెడే ఒక ప్రకటనలో తెలిపారు. 

చాలా బాధపడ్డాను
నవాబ్‌ మాలిక్‌ ఆరోపణలు తనను, తన కుటుంబాన్ని మానసిక వేదనకు గురిచేశాయని సమీర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా వ్యక్తిగత పత్రాలను ప్రచురించడం పరువు నష్టం కలిగించేది మాత్రమే కాదు నా కుటుంబ గోప్యతపై అనవసరమైన దాడి కూడా. ఇది నన్ను, నా కుటుంబాన్ని, నా తండ్రిని, చనిపోయిన నా తల్లిని కించపరచడానికి ఉద్దేశపూర్వకంగా చేసింది. గత కొన్ని రోజులుగా గౌరవ మంత్రి చర్యలు నన్ను, నా కుటుంబాన్ని విపరీతమైన మానసిక, మానసిక ఒత్తిడికి గురి చేశాయి. వ్యక్తిగత, పరువు నష్టం కలిగించే దాడులతో నేను బాధపడ్డాను’ అని సమీర్‌ వాంఖెడే ట్విటర్‌లో పేర్కొన్నారు. 

మతం మారలేదు: సమీర్‌ భార్య
తన భర్తపై మంత్రి నవాబ్‌ మాలిక్‌ చేసిన ఆరోపణలపై సమీర్‌ వాంఖెడే భార్య షిమాతి క్రాంతి దిననాథ్ రెడ్కార్‌ ట్విటర్‌లో స్పందించారు. తాను, తన భర్త జన్మతః హిందువులమని, మరో మతంలోకి మారలేదని స్పష్టం చేశారు. అన్ని మతాలను గౌరవిస్తామని పేర్కొంటూ తమ పెళ్లినాటి ఫొటోలను ఆమె ట్విటర్‌లో షేర్‌ చేశారు. 

కాగా, తప్పుడు ఆరోపణలతో తనపై కుట్రకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, చట్టబద్ద రక్షణ కల్పించాలంటూ సమీర్‌ వాంఖెడే ఇప్పటికే పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ముంబై పోలీసు కమిషర్‌ హేమంత్‌ నగ్రాలేకి ఆయన లేఖ రాశారు. అయితే డ్రగ్స్‌ కేసులతో మహారాష్ట్ర పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని శివసేన, ఎన్‌సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. (చదవండి: ముంబై డ్రగ్స్‌ కేసు.. ఆర్యన్‌ను వదిలేయడానికి రూ.25 కోట్లు?)

మరిన్ని వార్తలు