ఆర్యన్‌ కేసు నుంచి వాంఖెడే అవుట్‌

6 Nov, 2021 05:23 IST|Sakshi

సిట్‌కు ముంబై డ్రగ్స్‌ కేసు బదిలీ  

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారూక్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ నిందితుడుగా ఉన్న ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖెడేని ఈ కేసు విచారణ నుంచి తప్పించారు. ఆర్యన్‌ను విడిచిపెట్టడానికి ముడుపులు అడిగారని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్యన్‌ డ్రగ్స్‌తో సహా ఆరు కేసుల్ని ముంబై జోన్‌ నుంచి ఢిల్లీలోని ఎన్‌సీబీ కేంద్ర కార్యాలయానికి బదిలీ చేస్తున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఈ కేసుల్ని విచారించడానికి ఎన్‌సీబీ సీనియర్‌ అధికారి సంజయ్‌ సింగ్‌ ఆధ్వర్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ అల్లుడు సమీర్‌ ఖాన్, నటుడు అర్మాన్‌ కొహ్లి కేసులు కూడా ఇందులో ఉన్నాయి. డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ ఖాన్‌ను విడిచిపెట్టడానికి రూ.25 కోట్లకు డీల్‌ కుదిరిందని అందులో వాంఖెడే వాటా రూ.8 కోట్లు అంటూ ఈ కేసులో సాక్షి ప్రభాకర్‌ సాయిల్‌ ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై వాంఖెడేపై శాఖాపరమైన దర్యాప్తు కూడా కొనసాగుతోంది. ఇక మంత్రి నవాబ్‌ మాలిక్‌ అడుగడుగునా వాంఖెడేపై ఆరోపణలు చేయడంతో ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంది.

  ఎన్‌సీబీ మాత్రం డ్రగ్స్‌ కేసులో జాతీయ, అంతర్జాతీయ ముఠా హస్తం ఉందని, దీనిపై లోతుగా విచారించడం కోసమే సిట్‌ ఏర్పాటు చేసినట్టుగా తెలిపింది. వాంఖెడే ముంబై జోనల్‌ డీజీగా కొనసాగుతారని స్పష్టం చేసింది.  ఇలా ఉండగా, ఆర్యన్‌ ఖాన్‌ శుక్రవారం ఎన్‌సీబీ కార్యాలయానికి వెళ్లి హాజరు వేయించుకున్నాడు. బాంబే హైకోర్టు ఆర్యన్‌కు బెయిల్‌ ఇస్తూ ప్రతీ శుక్రవారం ఎన్‌సీబీ కార్యాలయానికి వ్యక్తిగతంగా హాజరుకావాలని షరతు విధించింది. బెయిల్‌ వచ్చి న తర్వాత తొలిసారి శుక్రవారం మధ్యాహ్నం ఎన్‌సీబీ కార్యాలయానికి ఆర్యన్‌ వచ్చాడు.

మరిన్ని వార్తలు