రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోండి

28 Jun, 2021 08:09 IST|Sakshi

సంయుక్త కిసాన్‌ మోర్చా డిమాండ్‌ 

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ శనివారం ఆందోళన చేసిన రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం– రైతు సంఘాల ఐక్యవేదిక) డిమాండ్‌ చేసింది. ఆందోళనలు చేపట్టి ఏడు నెలలైన సందర్భంగా పలు రాష్ట్రాల్లో గవర్నర్లకు విజ్ఞాపనపత్రాలు ఇవ్వడానికి రైతులు రాజ్‌భవన్‌లవైపు వెళ్లగా... పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

‘చండీగఢ్‌లో పలువురు ఎస్‌కేఎం నాయకులు, ఆందోళనకారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ 147, 148, 149, 186, 188, 332, 353 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. రాజ్‌భవన్‌కు దారులు మూసివేయడమే కాకుండా రైతులపై వాటర్‌ క్యానన్లు ప్రయోగించారు. లాఠీచార్జి చేశారు. పైగా అప్రజాస్వామికంగా కేసులు బనాయించారు. ఎస్‌కేఎం దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. వెంటనే భేషరతుగా ఈ కేసులన్నింటినీ ఉపసంహరించాలి’ అని ఎస్‌కేఎం ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేసింది.

ఇంత నిర్లక్ష్యమా?: రాహుల్‌ 
రైతుల ఆందోళనలు ఉధృతమవుతున్నా... ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. 200 రోజులకు పైగా ఢిల్లీ శివార్లలో ఆందోళనలను నిర్వహిస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటించారు. ‘తమ జీవనోపాధికి రక్షణ కల్పించాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ దిగుబడులను అమ్మితే వచ్చే డబ్బు కంటే పెట్టుబడులు అధికంగా ఉంటున్నాయి. రైతుల ఆందోళనలు ఉధృతమవుతున్నా... ప్రభుత్వ విధానాల్లో వీరిపట్ల ఎలాంటి సానుభూతి కనిపించడం లేదు’ అని రాహుల్‌ మండిపడ్డారు.

చదవండి: 
డీఏను తక్షణమే పునరుద్ధరించాలి: కాంగ్రెస్‌
తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు ఆపాల్సిందే

మరిన్ని వార్తలు