అన్నదాతల ఆందోళన విరమణ 

10 Dec, 2021 08:01 IST|Sakshi

 శనివారం నిరసన ప్రాంతాల ఖాళీ 

హామీలు నెరవేర్చకుంటే తిరిగి ఆందోళన బాట 

సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటన 

శిబిరాల తొలగింపు ఆరంభం 

దేశవ్యాప్తంగా నిరసన స్థలాల్లో 11న విజయ్‌ దివస్‌ 

న్యూఢిల్లీ: రైతు చట్టాల రద్దు సహా పలు డిమాండ్ల సాధనకు ఏడాదిగా చేస్తున్న ఆందోళనను నిలిపివేస్తున్నట్లు 40 రైతు సంఘాల వేదిక సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) గురువారం ప్రకటించింది. డిసెంబర్‌ 11 నుంచి ఢిల్లీ సరిహద్దుల్లోని నిరసన ప్రాంతాలను ఆందోళన చేస్తున్న రైతులు ఖాళీ చేస్తారని తెలిపింది. జనవరి 15న తిరిగి రైతు నేతలు సమావేశమవుతారని, ప్రభుత్వం తమ డిమాండ్లను ఎంతవరకు నెరవేర్చిందో చర్చిస్తారని తెలిపింది. పెండింగ్‌లో ఉన్న డిమాండ్ల పరిష్కారానికి యత్నిస్తామని కేంద్రం నుంచి లేఖ అందడంతో ఎస్‌కేఎం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. కేంద్రం తరఫు వ్యవసాయ కార్యదర్శి సంజయ్‌ అగర్వాల్‌ ఈ లేఖను పంపారని ఎస్‌కేఎం సభ్యుడు యోగేంద్ర యాదవ్‌ తెలిపారు.

కనీస మద్దతు ధరకు (ఎంఎస్‌పీ) చట్టబద్ధతపై కమిటీ ఏర్పాటు, రైతులపై కేసుల ఉపసంహరణ తదితర డిమాండ్లను అంగీకరిస్తున్నట్లు లేఖలో తెలిపారు. ఎంఎస్‌పీపై నిర్ణయం తీసుకునేవరకు పంటధాన్యాల సేకరణపై యథాతధ స్థితి కొనసాగుతుందన్నారు. ఎంఎస్‌పీపై రైతులు లేవనెత్తిన డిమాండ్‌ పరిష్కరించేందకు ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించింది. ఈ కమిటీలో ప్రభుత్వ అధికారులు, వ్యవసాయ నిపుణులు, ఈ నిరసనకు నాయకత్వం వహించిన రైతు సంఘాల నేతలు ఉంటారని తెలిపింది. రైతులపై పెట్టిన పోలీసు కేసుల్ని ఉపసంహరించుకోవడానికి ఆయా రాష్ట్రాలు అంగీకరించాయని కేంద్రం పంపిన లేఖలో వెల్లడించింది.

కేంద్రపాలిత ప్రాంతాలు, రైల్వేలు పెట్టిన కేసులనూ ఉపసంహరిస్తామని తెలిపింది. ఎస్‌కేఎంతో చర్చల అనంతరమే విద్యుత్‌ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని హామీ ఇచ్చింది. నిరసనల్లో భాగంగా ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం అందించేందుకు హరియాణా, యూపీ ప్రభుత్వాలు సూత్రప్రాయంగా ఒప్పుకున్నాయని తెలిపింది. పంటపొల్లాల్లో దుబ్బులను తగలబెట్టడాన్ని ఇకపై క్రిమినల్‌ నేరంగా పరిగణించరని పేర్కొంది.. డిసెంబర్‌ 11న రైతులు తమతమ ప్రాంతాలకు విజయయాత్ర చేపడుతూ వెళ్తారు. దేశవ్యాప్తంగా నిరసన స్థలాల వద్ద ‘విజయ్‌ దివస్‌’ను నిర్వహిస్తామని ఎస్‌కేఎం తెలిపింది. రైతులు వెనుదిరిగినా, ఎస్‌కేఎం మనుగడలోనే ఉంటుందని రైతు నేత రాకేశ్‌ తికాయత్‌ స్పష్టం చేశారు.  

ఇబ్బంది పెట్టాం.. క్షమించండి! 
తమ నిరసనల వల్ల ఇబ్బందులు పడ్డ ప్రజానీకానికి ఎస్‌కేఎం క్షమాపణలు చెప్పింది. తమది చారిత్రాత్మక విజమన్న ఎస్‌కేఎం నేత శివకుమార్‌ కాకా, తమ వల్ల ఇబ్బంది ఎదుర్కొన్న వ్యాపారవేత్తలు, ప్రజలను మన్నింపు కోరారు. రైతు నిరసనలతో దేశ రాజధాని సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురైన సంగతి తెలిసిందే! రైతులు తమ తమ శిబిరాలను తొలగించడం ఆరంభించారు. తమ నిరసనలకు ఫలితం దక్కడంతో రైతులు శనివారం ఉదయం సింఘు, టిక్రీ ప్రాంతాల్లో విజయోత్సవ ర్యాలీని చేపట్టనున్నట్లు తెలిసింది. తమ ఆందోళన విజయవంతం కావడంతో నిరసన ప్రాంతాల్లో ఆనందం వెల్లివిరిసింది. రైతులు స్వీట్లు పంచుకుంటూ, పాటలు పాడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆందోళన విరమించాలన్న రైతు సంఘాల నిర్ణయాన్ని కేంద్రం, పలు రాజకీయపార్టీలు స్వాగతించాయి. 

ఎందుకీ ఆందోళన? 
ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గత సంవత్సరం నవంబర్‌ 26 నుంచి రైతులు ఆందోళనలకు దిగారు. సంవత్సరకాలంగా జరిపిన నిరసనలకు కేంద్రం దిగివచ్చి సదరు చట్టాలను రద్దు చేసింది. ఈ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు గత నెల స్వయానా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. ఆ తర్వాత పార్లమెంట్‌ శీతకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే సాగు చట్టాల రద్దు బిల్లుకు ఉభయ సభల్లో ఆమోదం లభించింది. అయితే తమ మిగతా ఆరు డిమాండ్లను కూడా కేంద్రం పరిష్కరించాలంటూ రైతు సంఘాలు నిరసనలు కొనసాగించాయి. దీనిపై కేంద్రానికి, ఎస్‌కేఎంకు మధ్య పలు దఫాలుగా సంప్రదింపుల జరిగాయి.  ఎస్‌కేఎంకు కేంద్రం గురువారం ఒక ముసాయిదా ప్రతిపాదనను పంపింది. దీనిపై చర్చించిన అనంతరం ఎస్‌కేఎం ఆందోళన విరమణ ప్రకటన చేసింది.  

రాజకీయాల్లో చేరాలనుకునే వాళ్లు వెళ్లిపోండి! 
ఎస్‌కేఎంను జాతీయస్థాయి సంస్థగా తీర్చిదిద్దాలని సభ్యులు భావిస్తున్నారు.  సంఘంలో ఎవరైనా రాజకీయాల్లో చేరాలనుకుంటే సంఘం నుంచి వెళ్లిపోవాలని ఎస్‌కేంఎ కోర్‌ కమిటీ సభ్యుడు దర్శన్‌ పాల్‌ తేల్చిచెప్పారు. రైతు సంఘాల సమాఖ్య ఎప్పటికీ రాజకీయేతరంగానే ఉంటుందన్నారు. పంజాబ్‌లో పరిస్థితులను ప్రభావితం చేసేలా రైతు సంఘాలు రాజకీయాలపై దృష్టి పెట్టవద్దన్నారు. జనవరి 15 సమావేశంలో జాతీయ స్థాయి మోర్చాగా ఎదగడంపై చర్చిస్తామన్నారు.  
 

మరిన్ని వార్తలు