Agnipath Scheme: ‘అగ్నిపథ్‌’కు వ్యతిరేకంగా 24న దేశ్యవ్యాప్త నిరసన

20 Jun, 2022 19:33 IST|Sakshi

సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటన

న్యూఢిల్లీ: అగ్నిపథ్‌ పథకం అమలుపై కేంద్రం దూకుడు ప్రదర్శిస్తుండగా... అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. దీనిలో భాగంగా సోమవారం భారత బంద్‌కు విపక్షాలు పిలుపునిచ్చాయి. రైతు సంఘాలు కూడా అగ్నిపథ్‌ వ్యతిరేక ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. 

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అగ్నిపథ్‌ సైనిక నియామక పథకానికి వ్యతిరేకంగా జూన్‌ 24న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు రైతు సంఘం సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) సోమవారం ప్రకటించింది. హరియాణాలోని కర్నాల్‌లో జరిగిన ఎస్‌కెఎం సమన్వయ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు  రైతు నాయకుడు రాకేష్‌ తికాయిత్‌ తెలిపారు. 

జిల్లా, తహసీల్ ప్రధాన కార్యాలయాల్లో శుక్రవారం జరిగే నిరసన ప్రదర్శనలకు యువత, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున యువతను సమీకరించాలని పౌర సంఘాలు, రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) కూడా నిరసనల్లో పాల్గొంటుందని వెల్లడించారు. కాగా, అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా జూన్ 30న నిరసనలకు బీకేయూ పిలుపునిచ్చింది. (క్లిక్‌: ఆర్మీలో అగ్నివీర్‌ నోటిఫికేషన్‌ విడుదల)

మరిన్ని వార్తలు