మద్దతు ధరకు చట్టబద్ధత

22 Nov, 2021 04:44 IST|Sakshi
ఎస్‌కేఎం సదస్సులో పాల్గొన్న రైతులు

ఇక దానిపై పోరుబాట

రైతు సంఘాల నిర్ణయం

నేడు లక్నోలో మహాపంచాయత్‌

26న ఢిల్లీ సరిహద్దుల్లో మోహరింపు

29న యధావిధిగా పార్లమెంటుకి మార్చ్‌ 

ఉద్యమ కార్యాచరణపై మరోసారి 27న సమావేశం

న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకునేలా చేసిన రైతన్నలు ఇక కనీస మద్దతు ధర కోసం పోరుబాట పట్టనున్నారు. కనీస మద్దతు ధరకు కేంద్రం చట్టబద్ధత కల్పించేంతవరరు ఉద్యమాన్ని కొనసాగించడానికి వ్యూహాలు రచిస్తున్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు ఢిల్లీలో ఆదివారం సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) సమావేశమైంది.

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో బలప్రదర్శన  చేయాలని నిర్ణయానికొచ్చింది. సోమవారం లక్నోలో మహాపంచాయత్‌ కార్యక్రమాన్ని నిర్వహించి, కేంద్రానికి రైతుల బలమేంటో మరోసారి చూపిస్తామని రైతు సంఘం నాయకుడు రాకేశ్‌ తికాయత్‌ చెప్పారు. ‘‘వ్యవసాయ రంగంలో ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చినా రైతన్నల కష్టాలు తీరవు. కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించడమే అతి పెద్ద సంస్కరణ’’ అని అన్నారు.

పార్లమెంట్‌లో వ్యవసాయ చట్టాల ఉపసంహరణతో పాటు తాము చేస్తున్న డిమాండ్‌లన్నీ కేంద్రం నెరవేర్చేవరకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధరపై చట్టం చేసేవరకు ఉద్యమం కొనసాగేలా కార్యాచరణ రూపొందించనున్నారు. ఇందుకోసం మరోసారి ఈ నెల 27న సమావేశం కావాలని నిర్ణయించారు. రైతు సంఘాలు ఆరు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచాయి. వీటిపై తమతో కేంద్ర ప్రభుత్వం చర్చలు ప్రారంభించేదాకా ఆందోళన కొనసాగిస్తామని తేల్చిచెప్పాయి.

29న పార్లమెంట్‌ వరకూ ర్యాలీ  
తమ డిమాండ్ల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచే కార్యక్రమాలను రైతులు ముమ్మరం చేయనున్నారు. సోమవారం లక్నోలో కిసాన్‌ పంచాయత్‌తో పాటు ఈ నెల 26న ఢిల్లీలో అన్ని సరిహద్దుల్లో మోహరిస్తామని, పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే రోజు అంటే ఈ నెల 29న పార్లమెంట్‌ వరకు ర్యాలీ నిర్వహిస్తామని రైతు సంఘం నేత బల్బీర్‌ సింగ్‌ రాజేవాలే వెల్లడించారు.  

24న కేంద్ర కేబినెట్‌ సమావేశం
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి అవసరమైన అధికార ప్రక్రియను త్వరితంగా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. ఈ నెల 24న (బుధవారం) కేంద్ర మంత్రిమండలి సమావేశమయ్యే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడానికి కేబినెట్‌ తీర్మానాన్ని ఆమోదించనుంది.

వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే వ్యవసాయ చట్టాల రద్దు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసింది. ఈ నెల 29 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ సమావేశాల కంటే ముందుగానే కేబినెట్‌ సమావేశమై చట్టాల రద్దుపై చర్చించి దానికి  అవసరమైన తీర్మానాన్ని ఆమోదిస్తుంది. ఆపై ఉపసంహరణ బిల్లుకు తుదిరూపమిస్తారు.

ప్రధాని మోదీకి బహిరంగ లేఖ
సంయుక్త కిసాన్‌ మోర్చా ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాసింది. ఎంఎస్పీకి చట్టబద్ధతతోపాటు మొత్తం ఆరు డిమాండ్లపై రైతులతో తక్షణమే చర్చలు ప్రారంభించాలని పేర్కొంది. అప్పటిదాకా పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పింది. మూడు సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేసింది. ‘‘11 రౌండ్ల చర్చల తర్వాత ద్వైపాక్షిక పరిష్కార మార్గం కనుగొనడం కంటే మీరు(ప్రధాని మోదీ) ఏకపక్ష తీర్మానానికే మొగ్గుచూపారు’’ అని లేఖలో ప్రస్తావించింది.

రైతు సంఘాల ఆరు డిమాండ్లు
► పంటలకు కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) చట్టబద్ధత కల్పించాలి.
► గత ఏడాది కాలంగా జరిగిన ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన 700 మందికి పైగా రైతు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి.
► రైతులపై నమోదు చేసిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలి.
► పోరాటంలో రైతుల ప్రాణత్యాగాలకు గుర్తుగా ఒక స్మారక స్తూపం నిర్మించాలి.
► పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్‌ బిల్లులను మాఫీ చేయాలి. ప్రతిపాదిత విద్యుత్‌ సవరణ బిల్లు–2020/21 ముసాయిదాను వెనక్కి తీసుకోవాలి. ‘‘దేశ రాజధాని ప్రాంతం, పరిసర ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ కమిషన్‌ చట్టం–2021’ లో రైతులపై జరిమాన విధించే అంశాలను తొలగించాలి. హా లఖీమీపూర్‌ ఖేరి ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాను పదవి నుంచి తొలగించి, అరెస్టు చేయాలి.  

మరిన్ని వార్తలు