చర్చలకు సిద్ధం: ప్రధానికి రైతు సంఘాల లేఖ

22 May, 2021 14:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య నాలుగు నెలలుగా నెలకొన్న  ప్రతిష్టంభన వీడే అవకాశం కనిపిస్తోంది. కరోనా ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా ఢిల్లీ సరిహద్దులో దీక్ష చేస్తున్న రైతులు ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమంటూ ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గత ఆరు నెలలుగా వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీ సరిహద్దులో సింఘు, టిక్రీ వద్ద అలుపెరగని పోరాటం చేస్తున్నారు.

బ్లాక్‌డేకి ముందు 
ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేపడుతున్న 40 రైతు సంఘాలన్నీ కలిసి  రైతు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడ్డాయి. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేసిన రోజైన  మే 26న బ్లాక్‌డేగా ప్రకటించాయి. ఆరోజు నల్ల జెండాలు ఎగురవేసి నిరసన తెలపాలని పిలుపునిచ్చాయి. ఈ నిరసనలో పాల్గొనేందుకు వేలాదిగా ట్రాక్టర్లతో  రైతులు ఛలో ఢిల్లీ అంటూ వస్తున్నారు. మరోసారి ఢిల్లీ సరిహద్దులో ఉద్రిక్తతలు తప్పవని అంతా భావిస్తున్న తరుణంలో... రైతు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ చర్చలకు సిద్దమంటూ ముందుకు వచ్చింది.

ఇప్పటికే 11 సార్లు
ఇప్పటి వరకు ప్రభుత్వం, రైతుల మధ్య 11 సార్లు చర్చలు జరిగాయి. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు పట్టుబడుతుండగా... రద్దు చేయడం కుదరదని కేవలం సవరణలే చేస్తామంటూ ప్రభుత్వం భీష్మించుకుంది. దీంతో ఆరు నెలలు గడిచినా ఈ సమస్యకు పరిష్కారం లభించలేదు. మరోవైపు  ఢిల్లీలో ఉండే తీవ్రమైన చలి, ఎండలను తట్టుకోవడంతో పాటు కరోనా సెకండ​ వేవ్‌ భయపెడుతున్నా సరే ... రైతులు ఢిల్లీని వీడకుండా ఆందోళన చేస్తూ తమ పట్టుదలను చాటుకున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు