సిబ్బంది నిర్లక్ష్యం: చిన్నారులకు ప్రాణాపాయం

1 Feb, 2021 20:02 IST|Sakshi

ముంబై: పోలియో చుక్కల పంపిణీలో సిబ్బంది చేసిన నిర్వాకంతో చిన్నారులు అస్వస్థతకు గురయ్యాయి. కరోనా రాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వినియోగించే శానిటైజర్‌ను పోలియో చుక్కల మాదిరిగా వేశారు. దీంతో చిన్నారులు ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని యావత్మల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు చెప్పారు. అయితే ఈ ఘటనపై చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

దేశవ్యాప్తంగా ఆదివారం (జనవరి 31) చిన్నారులకు పోలియో చుక్కల పంపిణీ చేశారు. అయితే యావత్మల్‌లో పిల్లలకు పోలియో చుక్కలకు బదులు శానిటైజర్‌ చుక్కలు వేశారు. దీంతో చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపింది. శానిటైజర్‌ చుక్కలు వేయించుకున్న 12 మంది పిల్లల అస్వస్థతకు గురయ్యారు. కంగారుపడిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పుడు గుర్తించారు.. పిల్లలకు పోలియో బదులు శానిటైజర్‌ వేశారని. ప్రస్తుతం పిల్లల ఆరోగ్యం బాగుందని.. కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. అయితే విధుల్లో నిర్లక్ష్యం వహించిన డాక్టర్‌, ఆరోగ్య, ఆశా కార్యకర్తలను సస్పెండ్‌ చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు