శివాజీపై వ్యాఖ్యల ఎఫెక్ట్‌.. సీఎం షిండేకు ఊహించని షాక్‌!

21 Nov, 2022 18:02 IST|Sakshi

మహారాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారింది. ఛత్రపతి శివాజీపై మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారీ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్‌గా సంచలనంగా మారాయి. గవర్నర్‌ వ్యాఖ్యలను ఉద్ధవ్‌ థాక్రే వర్గం, శివసేన నేతలు తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేపై ఆయన వర్గానికే చెందిన ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాగా, గవర్నర్‌ కోష్యారీ వ్యాఖ్యలపై శివసేన ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గైక్వాడ్‌ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌ను తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్‌ చేశారు. కోష్యారీ గతంలో కూడా ఇలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌.. ప్రపంచలోని మరే ఇతర వ్యక్తితోనూ పోల్చలేరని అన్నారు. మహారాష్ట్ర చరిత్ర తెలియని వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధకరమని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ పార్టీకి, సీనియర్‌ నేతలకు ఇక్కడి చరిత్ర తెలిసినట్టు లేదని చురకలు అంటించారు. ఇప్పటికైనా తన తప్పు తెలుసుకుని గవర్నర్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అయితే, షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఇలాంటి కామెంట్స్‌ చేయడంతో మహారాష్ట్ర రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. 

ఇక, అంతకుముందు.. గవర్నర్‌ వ్యాఖ్యలపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఖండించారు. గవర్నర్‌ను తక్షణమే తొలగించాలంటూ డిమాండ్‌ చేశారు. అసలు షిండే మహారాష్ట్ర బిడ్డేనా? అని నిలదీశారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండ్ వెంటనే రాజీనాయాలన్నారు. ఈ ఏడాది వ్యవధిలో గవర్నర్‌ కోష్యారీ నాలుగుసార్లు ఛత్రపతి శివాజీని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారన్నారు రౌత్‌. అయినా మహారాష్ట్ర ప్రభుత్వ మౌనంగానే ఉందంటూ విరుచుకుపడ్డారు.

అయితే, మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారీ ఔరంగాబాద్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. శివాజీ మహారాజ్ పాత విగ్రహం అయిపోయాయని, ఇప్పుడూ మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ నితిన్ గడ్కరీ వంటి వారెందరో అందుబాటులో ఉన్నారని వ్యాఖ్యానించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు మహారాష్ట్రలో పెనుదుమారం రేపాయి. 
 

మరిన్ని వార్తలు