మాకు సంబంధం లేదు: ఆమె ముంబైలో ఉండొచ్చు!

10 Sep, 2020 15:47 IST|Sakshi

శివసేన పార్లీ ప్రమేయం లేదు

కంగనపై పోలీసులకు ఫిర్యాదు

ముంబై: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ఆఫీస్‌ కూల్చివేతకు, శివసేనకు ఎటువంటి సంబంధం లేదని ఆ పార్టీ ముఖ్యనేత, రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌ అన్నారు. అదే విధంగా తానెప్పుడూ కంగనాను బెదిరించలేదని, ఆమె ముంబైలో హాయిగా జీవించవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కంగన కార్యాలయం వద్ద చోటుచేసుకున్న పరిణామాలతో మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. బీఎంసీ ఈ చర్యను చేపట్టింది. కావాలంటే ఈ విషయం గురించి మీరు మేయర్‌ లేదా బీఎంసీ కమిషనర్‌తో మాట్లాడవచ్చు’’ అని వ్యాఖ్యానించారు. ఇక సంజయ్‌ రౌత్‌ బుధవారం ఇదే విషయంపై స్పందిస్తూ.. ‘‘నేనెప్పుడూ కంగనా రనౌత్‌ను బెదిరించలేదు. కేవలం ముంబైని పీఓకేతో పోల్చినందుకు ఆగ్రహం వ్యక్తం చేశాను. అంతే. బీఎంసీ తీసుకున్న చర్యలకు నేను బాధ్యుణ్ణి కాదు. నా వరకు ఆ విషయం ఎప్పుడో ముగిసిపోయింది. కంగన ముంబైకి వచ్చి, ఇక్కడే నివసించడాన్ని స్వాగతిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. (చదవండి: కంగన ఆఫీస్‌ కూల్చివేత.. గవర్నర్‌ సీరియస్‌!)

వివాదానికి దారి తీసిన పరిస్థితులు
నటుడు సుశాంత్‌ సింగ్‌ మృతి నేపథ్యంలో బయటపడిన డ్రగ్స్‌ వ్యవహారం, మాఫియా గురించి గళమెత్తిన కంగనాకు శివసేన నేతృత్వంలోని సంకీర్ణ సర్కారు రక్షణ కల్పించాలంటూ బీజేపీ నేత రామ్‌ కదమ్‌ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీ-టౌన్‌ మాఫియా కంటే తనకు ముంబై పోలీసులంటేనే ఎక్కువ భయమని, వారికి బదులుగా హిమాచల్‌ ప్రదేశ్‌ లేదా కేంద్ర బలగాలు తనకు రక్షణ కల్పించాలంటూ కంగన సోషల్‌ మీడియా వేదిగకా తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఇందుకు స్పందించిన సంజయ్‌ రౌత్‌ చేసిన కంగనపై మాటల యుద్ధానికి దిగారు. ముంబై పోలీసులను కించపరచడం సరికాదంటూ ఘాటు విమర్శలు చేశారు. దీనికి కంగన సైతం అదే స్థాయిలో బదులిస్తూ.. ముంబై ఏమైనా పాక్‌ ఆక్రమిత కశ్మీరా అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.(చదవండి: 4 రోజుల్లో కంగన వెళ్లిపోతున్నారు: బీఎంసీ)

అంతేకాదు సెప్టెంబరు 9న ముంబై వస్తున్నానని, దమ్ముంటే తనను ఆపాలని సవాల్‌ విసిరిన ఆమె అన్నట్లుగానే బుధవారం రాజధాని నగరంలో అడుగుపెట్టారు. అయితే అదే సమయంలో బీఎంసీ అధికారులు కంగన కార్యాలయంలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ కూల్చివేతలకు దిగడంతో.. తమకు వ్యతిరేకంగా మాట్లాడినందునే శివసేన కంగనపై క్షక్షగట్టిందంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అంతేగాక సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామి ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ సైతం ఈ విషయంపై అసహనం వ్యక్తం చేశారు. అదే విధంగా గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కొశ్యారీ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్రానికి నివేదిక ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.(చదవండి: మహరాష్ట్ర సీఎం ఠాక్రేను హెచ్చరించిన కంగనా)

కంగనపై ఫిర్యాదు
ఇక ముంబై హైకోర్టు సైతం దురుద్దేశపూర్వకంగానే బీఎంసీ ఈ చర్యకు పూనుకున్నట్లుగా ఉందంటూ మొట్టికాయలు వేసింది. ఇలా అన్నివర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో సంజయ్‌ రౌత్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే వ్యూహాత్మకంగానే ఆయన వెనక్కితగ్గారా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా బంగ్లా కూల్చివేత పరిణామాల నేపథ్యంలో కంగన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ‘‘అసలు నువ్వేమనుకుంటున్నావు? మూవీ మాఫియాతో కలిసి నా ఇంటిని కూల్చేసి ప్రతీకారం తీర్చుకుంటున్నా అనుకుంటున్నావా? ఈరోజు నా ఇల్లు కూలింది. రేపు నీ అహంకారం కుప్పకూలుతుంది. కాలచక్ర గమనం మారుతూనే ఉంటుంది’’అంటూ మండిపడ్డారు. దీంతో ముఖ్యమంత్రిని మర్యాద లేకుండా నువ్వు అని సంబోధించడమే గాకుండా ఆయనపై ఆరోపణలు చేసినందుకు గానూ శివసేన వర్గాలు కంగనపై విఖ్రోలీ పోలీస్‌ స్టేషనులో ఫిర్యాదు చేశాయి.  

మరిన్ని వార్తలు