Maharashtra Crisis: శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ సంచలన ప్రకటన

23 Jun, 2022 15:27 IST|Sakshi

ముంబై: శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ సంచలన ప్రకటన చేశారు. సంకీర్ణ కూటమి నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.  24 గంటల్లో రెబల్‌ ఎమ్మెల్యేలు ముంబై చేరుకుంటే.. కూటమి నుంచి వైదొలిగే అంశాన్నిపరిశీలిస్తామని అన్నారు. తమ డిమాండ్లన్నీ పరిగణలోకి తీసుకుంటామన్నారు. రెబల్స్‌ ఎమ్మెల్యేలలో 21 మంది తమతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. వాళ్లంతా ముంబై చేరుకున్నాక పరిస్థితులు చక్కబడతాయన్నారు.

‘రెబల్‌ ఎమ్మెల్యేలు గౌహతి నుంచి కమ్యూనికేట్‌ చేయకూడదు. ముంబై తిరిగి వచ్చి సీఎంతో చర్చించాలి. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి ఎలాంటి ఢోకా లేదు.. బలపరీక్ష జరిగినప్పుడు అందరూ చూస్తారని, బలపరీక్షలో అధికార కూటమి మహా వికాస్ అఘాడి గెలుస్తుంది. శివసేనకు ద్రోహం చేయాలనుకునేవారు బాల్‌థాక్రే అనుచరులు, నిజమైన శివ సైనికులు కాలేరు’ అంటూ సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు. 
సంబంధిత వార్త: శివసేన రెబల్స్‌కు బీజేపీ భారీ ఆఫర్‌!

మరోవైపు శివసేన పార్టీ పూర్తి ఆధిపత్యంపై ఏక్‌నాథ్‌ షిండే పట్టు సాధించారు. గౌహతి హోటల్‌ నుంచి మొత్తం 42 మంది ఎమ్మెల్యేలతో వీడియో విడుదల చేశారు. 42 మందిలో 35 మంది శివసేన, ఏడుగురు స్వతంత్రులు ఉన్నారు. విల్లు బాణం గుర్తు కోసం ఈసీకీ లేఖ రాసే యోచనలో షిండే ఉన్నారు. శివసేన పార్టీ సింబల్‌ తమకే కేటాయించాలని అంటున్నారు. కాగా ఇప్పటికే తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఏక్‌ నాథ్‌ షిండే సీఎం ఉద్దవ్‌ ఠాక్రేకు గురువారం మూడు పేజీల లేఖ రాశారు.

మరిన్ని వార్తలు