‘కంగనాకు కాషాయ పార్టీ మద్దతు అందుకే’

13 Sep, 2020 15:07 IST|Sakshi

రాజ్‌పుత్‌ల ఓట్ల కోసమే బీజేపీ తాపత్రయం : సంజయ్‌ రౌత్‌

ముంబై : శివసేన నేత సంజయ్‌ రౌత్‌ నేరుగా బీజేపీపై ఆదివారం విమర్శలు గుప్పించారు. ముంబైని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)తో పోల్చిన వారిని బీజేపీ సమర్ధిస్తోందని దుయ్యబట్టారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకే బీజేపీ బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌కు మద్దతివ్వాలని నిర్ణయించిందని కంగనా రనౌత్‌ పేరు ప్రస్తావించకుండా పేర్కొన్నారు. ముంబైని పీఓకేగా, బీఎంసీని బాబర్‌ సైన్యంతో పోల్చిన వారికి మహారాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం కొమ్ముకాయడం దురదృష్టకరమని పార్టీ పత్రిక సామ్నాలో రాసిన వ్యాసంలో సంజయ్‌ రౌత్‌ అన్నారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అగ్రవర్ణ రాజ్‌పుత్‌, క్షత్రియ ఓట్లను ఆకట్టుకోవడం కోసమే బీజేపీ ప్రయత్నమని దుయ్యబట్టారు.

మహారాష్ట్రను అవమానపరిచిన వారికి మద్దతిస్తూ బిహార్‌ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా బీజేపీ పనిచేస్తోందని విమర్శించారు. జాతీయవాదులుగా చెప్పుకునే వారికి ఇది తగదని మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తున్నా మహారాష్ట్ర బీజేపీ నేతలెవరూ నోరు మెదపడంలేదని అన్నారు. ముంబై ప్రాధాన్యతను తగ్గించేందుకు ప్రణాళికాబద్ధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, నగర ప్రతిష్టను దిగజార్చే కుట్రలో భాగంగా ఇలా జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మహారాష్ట్రలో మరాఠాలంతా ఏకమవ్వాల్సిన సంక్లిష్ట సందర్భమని శివసేన నేత వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రజలను ఓ నటి అవమానిస్తుంటే బీజేపీ నేతలు స్పందించడం లేదని, ఇది ఎలాంటి స్వేచ్ఛకు ప్రతీకని ప్రశ్నించారు. ఆ నటి (కంగనా రనౌత్‌) ముంబైని పీఓకేతో పోల్చితే ఏ ఒక్కరూ మాట్లాడలేదని రౌత్‌ బాలీవుడ్‌పైనా విమర్శలు గుప్పించారు. చదవండి : బాలీవుడ్‌ క్వీన్‌కు మరో షాక్‌

కంగనా అభిప్రాయాలు సినీ పరిశ్రమ అభిప్రాయాలు కాదని బాలీవుడ్‌ ప్రతినిధులు స్పష్టం చేయాలని కోరారు. కనీసం అక్షయ్‌ కుమార్‌ అయినా స్పందించాలని అన్నారు. ముంబై పట్ల కృతజ్ఞత చూపేందుకు కొందరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చురకలు వేశారు. వారికి ముంబై ప్రాధాన్యత కేవలం డబ్బు సంపాదించేందుకేనని, ముంబైని ఎవరైనా రేప్‌ చేసినా వారికి పట్టదని రౌత్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా నటుడు సుశాంత్‌ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తుపై తనకు నమ్మకం లేదని కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ముంబై పోలీసులపై విశ్వాసం లేకుంటే నగరంలో ఉండరాదని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించడంతో కంగనా, శివసేనల మధ్య వివాదం ముదిరింది.

మరిన్ని వార్తలు