ఛత్రపతి శివాజీపై వ్యాఖ్యల దుమారం... ఏక్‌నాథ్‌ షిండ్‌పై విమర్శలు

20 Nov, 2022 15:53 IST|Sakshi

ముంబై: ఛత్రపతి శివాజీపై మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే అలా ఎలా చూస్తూ... కూర్చొన్నారంటూ శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ మండిపడ్డారు. గవర్నర్‌ భగత్‌ సింగ్‌ని తక్షణమే తొలగించాలంటూ డిమాండ్‌ చేశారు. అసలు షిండే మహారాష్ట్ర బిడ్డేనా? అని నిలదీశారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండ్‌ని కూడా రాజీనామ చేయాలంటూ డిమాండ్‌ చేశారు. గవర్నర్‌ భగత్‌ సింగ్‌ ఈ ఏడాది వ్యవధిలో నాలుగుసార్లు ఛత్రపతి శివాజీని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారన్నారు రౌత్‌. అయినా మహారాష్ట్ర ప్రభుత్వ మౌనంగానే ఉందంటూ విరుచుకుపడ్డారు.

ఆత్మగౌరవ నినాదం ఇచ్చి మరీ శివసేనను విచ్ఛిన్నం చేసి ఉద్ధవ్‌ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన షిండేకు ప్రస్తుతం ఆ ఆత్మగౌరవం ఏమైందంటూ ఎద్దేవా చేశారు. ఇంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షాలు కూడా శివాజీ మహారాజ్‌ ఔరంగజేబుకు ఐదు సార్లు క్షమాపణలు చెప్పారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలకు మహారాష్ట్రకు క్షమాపణ చెప్పడమే కాకుండా తక్షణమే గవర్నర్‌ని తొలగించాలి అని ఒత్తిడి చేశారు . తాము కాంగ్రెస్‌ నాయకుడు రాహల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రలో భాగంగా వీర సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండించి తమ పార్టీ నిరసన తెలిపిందని గుర్తు చేశారు.

బీజేపీ బహిరంగంగానే శివాజీ మహారాజ్‌ని పలుమార్లు విమర్మించిందన్నారు. కాబట్టి షిండే రాజీనామ చేయాలని, బీజేపీతో కలిసి ప్రభుత్వంలో కొనసాగకూడదంటూ సీరియస్‌ అయ్యారు. ఈ మేరకు మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారీ ఔరంగాబాద్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ.... శివాజీ మహారాజ్ పాత విగ్రహాలు అయిపోయాయని, ఇప్పుడూ మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ నితిన్ గడ్కరీ వంటి వారెందరో అందుబాటు ఉన్నారని వ్యాఖ్యానించారు. 

ఉద్ధవ ఠాక్రే వర్గానికి చెందిన వ్యక్తులకు గవర్నర్‌ చేసిన ఈ వ్యాఖ్యలు మింగుడుపడం లేదు. దీంతో గవర్నర్‌ గొప్ప గొప్ప వ్యక్తులను అగౌరవపరిచే వ్యక్తి అంటూ పెద్ద ఎత్తున్న విమర్శలు గుప్పించారు. రాహుల్‌ వీర సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ బూట్లతో దాడి చేస్తోంది. మరీ ఇప్పుడూ గవర్నర్‌ చేసిన పనికి రాజ్‌భన్‌పైకి చెప్పులతో వెళ్లాలంటూ మండిపడ్డారు.

గవర్నర్‌ వ్యాఖ్యలు ప్రకారం కృష్ణుడు, రాముడు పాత్ర విగ్రహాలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడూ మనం కొత్త దేవతలను ఆరాధించాలా అని సంజయ్‌ రౌత్‌ ప్రశ్నించారు. అలాగే శివసేన పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్‌ దూబే ఛత్రపతి శివాజీ మహారాజ్ మా ఆరాధ్యదైవం మాత్రమే కాదు, ఎప్పటికీ అందరికి ఆదర్శప్రాయుడని అన్నారు. 

(చదవండి: రాహుల్ సావర్కర్‌ వ్యాఖ్యలపై దుమారం.. కాంగ్రెస్‌తో శివసేన తెగదెంపులు?)

మరిన్ని వార్తలు