గూగుల్‌ డూడుల్‌గా సరళ.. తొలి మహిళా పైలెట్‌ ఘనత గురించి తెలుసా?

8 Aug, 2021 14:26 IST|Sakshi

Google Doodle Sarla Thukral: ఆమె చీర కట్టింది. కాక్‌పిట్‌లో కూర్చుంది. ధైర్యంగా ఎయిర్‌క్రాఫ్ట్‌ నడిపింది. వెయ్యి గంటల ప్రయాణం తర్వాత దేశంలోనే తొలిసారి ‘ఏ’ గ్రేడ్‌ లైసెన్స్‌ దక్కించుకుంది. ఆ టైంకి ఆమె వయసు 21 ఏళ్లు మాత్రమే. అందుకే పైలెట్‌ సరళ పేరు చరిత్రకెక్కింది. 

సరళ త(తు)క్రల్‌.. భారత తొలి మహిళా పైలెట్‌. ఎయిర్‌క్రాఫ్ట్‌ను.. అదీ సంప్రదాయ చీరకట్టులో నడిపిన మొదటి మహిళా పైలెట్‌ ఈమె. ఇవాళ (ఆగష్టు 8న) ఆమె 107 జయంతి. అందుకే గూగుల్‌ ఆమె డూడుల్‌తో గుర్తు చేసింది. సాధారణంగా గూగుల్‌ డూడుల్‌ రెండుసార్లు రిపీట్‌ అయిన సందర్భాలు లేవు. నిజానికి కిందటి ఏడాదే సరళ పేరు మీద డూడుల్‌ రిలీజ్‌ కావాల్సి ఉంది. ఆ టైంలో కేరళలో విమాన ప్రమాదం జరిగింది. అందుకే ఆ టైంలో సహాయక చర్యలకు గుర్తుగా డూడుల్‌ను నిలిపివేశారు.

ఈసారి ఆమె మీద గౌరవార్థం 107వ జయంతి సందర్భంగా డూడుల్‌ను ఉంచినట్లు గూగుల్‌ ప్రకటించింది. ‘వైమానిక రంగంలో మహిళల ప్రవేశానికి స్ఫూర్తినిస్తూ చరిత్రలో ఆమె ఒక చెరగని ముద్ర వేశారు. అందుకే ఆమె కోసం రెండోసారి డూడుల్‌ని సృష్టించాం’ అని ప్రకటించింది గూగుల్‌. ఎయిర్‌క్రాఫ్ట్‌లో చీరకట్టులో ఉన్న ఈ డూడుల్‌ను  వ్రిందా జవేరీ రూపకల్పన చేశారు.
    

16 ఏళ్ల వయసుకే పెళ్లి.. 
సరళ.. 1914లో పుట్టారు. 16 ఏళ్ల వయసులో ఆమెకి పెళ్లైంది. ఆమె భర్త పైలెట్‌. ఆయన స్ఫూర్తితోనే పైలెట్‌ అవ్వాలనుకుంది. నాలుగేళ్ల పాప ఉండగానే.. 21 ఏళ్ల వయసులో చీర కట్టులో విమానం నడిపి ఏ గ్రేడ్‌ లైసెన్స్‌ దక్కించుకుంది. లాహోర్‌ ఫ్లైయింగ్‌ క్లబ్‌ తరపున ఈ ఘనత సాధించాక.. కమర్షియల్‌ పైలెట్‌ శిక్షణ కోసం జోధ్‌పూర్‌ వెళ్లింది. అయితే 1939లో ఆమె భర్త చనిపోవడం, రెండో ప్రపంచ యుద్ధం రావడంతో కమర్షియల్‌ పైలెట్‌ కావాలనే కల చెదిరింది. ఆపై లాహోర్‌కు వెళ్లి ఫైన్‌ ఆర్ట్స్‌, పెయింటింగ్‌ కోర్సులు చేసింది. విభజన తర్వాత ఢిల్లీకి వచ్చి ఆర్‌పీ త(తు)క్రల్‌ను వివాహం చేసుకుంది. ఆపై ఆభరణాల డిజైనింగ్‌, బట్టల డిజైనింగ్‌ వ్యాపారంతో ఎంట్రప్రెన్యూర్‌గా పెద్ద సక్సెస్‌ అయ్యింది. 2008లో సరళ తక్రల్‌ అనారోగ్యంతో కన్నుమూసింది.

మరిన్ని వార్తలు