పంచాయతీ కార్యాలయం కట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటా

22 Dec, 2020 09:06 IST|Sakshi

రాయగడ : కల్యాణ సింగుపురం సమితిలోని కొందొకత్తిపాడు గ్రామంలోనే పంచాయతీ కార్యాలయాన్ని నిర్మించాలని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆ గ్రామ సర్పంచ్‌ సునీత హికాక హెచ్చరించారు. ఈ విషయమై ఆమె తమ పంచాయతీలోని దంతలింగి, పొంగళి, ఒడాగుడ, చింతలిగుడ, కెందుగుడ గ్రామస్తులతో కలిసి కలెక్టరేట్‌లోని సబ్‌కలెక్టరు ప్రతాప్‌చంద్ర ప్రధాన్‌కి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇదివరకు పొలమ పంచాయతీలో ఉండే కొందొకత్తిపాడుని 6 నెలల క్రితం  ఆ పంచాయతీ నుంచి వేరుచేసి, కొత్త పంచాయతీగా చేశారని తెలిపారు.

ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న పంచాయతీ కార్యా లయాన్ని కొత్త పంచాయతీ కొందొకత్తిపాడులోనే ఏర్పాటు చేయాలని ఆమె పట్టుబట్టారు. అయితే కొద్దిరోజుల క్రితం పంచాయతీ కార్యాల యం నిర్మాణానికి సంబంధించి, పొలమ పంచాయతీకి దగ్గరలోని 7 సెంట్ల ప్రభుత్వ భూమిని అధికారులు పరిశీలించారని ఆమె పేర్కొన్నారు. కొందొకత్తిపాడులోని 10 సెంట్ల ప్రభుత్వ స్థలంలో పంచాయతీ కార్యాలయం నిర్మాణం చేపట్టకుండా వేరేచోట ఆ నిర్మాణం చేపట్టడం వెనక ఉన్న ఆంత్యర్యమేంటని ఆమె ప్రశ్నించారు. ఎటువంటి గ్రామసభలు నిర్వహించకుండా పంచాయతీ కార్యాలయం నిర్మాణం చేపట్టేందుకు అధికారులు ఈ ఏకపక్ష నిర్ణయంతో ముందుకు వెళ్తున్నారని ఆమె ఆరోపించారు. ఇప్పటికైనా కొందొకత్తిపాడులో ఉన్న అనువైన స్థలంలోనే పంచాయతీ కార్యాలయం నిర్మాణం జరిగేలా చూడాలని సబ్‌కలెక్టర్‌ని ఆమె కోరారు. దీనిపై స్పందించిన సబ్‌కలెక్టరు ఈ సమస్యని కలెక్టరు దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.    

మరిన్ని వార్తలు