సర్పంచ్‌ పదవికి వేలం పాట.. ఓర్ని! అన్ని లక్షలేందిరా సామీ..

19 Jan, 2022 09:49 IST|Sakshi

బొలంగీరు జిల్లాలో సర్పంచ్‌ పదవికి వేలం పాట 

రూ.44.10 లక్షలకు దక్కించుకున్న సుశాంత ఛత్రియా!

ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వెలుగుచూసిన ఘటన

దర్యాప్తునకు ఎన్నికల కమిషన్‌ కార్యాలయం ఆదేశాలు

భువనేశ్వర్‌/బొలంగీరు: రాష్ట్రంలో మూడంచెల పంచాయతీరాజ్‌ ఎన్నికల తొలి దశలోనే ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఇలా ప్రారంభమైందో లేదో పలుచోట్ల పదవుల వేలం పాట చోటుచేసుకుంటుండడం సంచలనం రేకిత్తిస్తోంది. తాజాగా బొలంగీరు జిల్లాలో సర్పంచ్‌ పదవిని వేలం వేసిన సంఘటన మంగళవారం వెలుగుచూసింది. దీనివెనక నిజానిజాల నిగ్గు తేల్చాలని జిల్లా కలెక్టరుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.  

వివరాలిలా ఉన్నాయి.. 
బొలంగీరు జిల్లా, పుంయింతొల మండలం, బిలెయిసొర్డా పంచాయతీలో సర్పంచ్‌ పదవి వేలం పాట జరిగింది. ఎన్నికల ప్రారంభ దశలోనే ఇటువంటి ఘటన తారసపడడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇదే పంచాయతీలో బిలెయిసొర్డా, బొందొనొకొటా, కొస్రుపల్లి గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో మొత్తం 15 వార్డులు ఉన్నాయి. ఇక్కడి సర్పంచ్‌ స్థానం రిజర్వేషన్‌ సాధారణ వర్గాలకు కేటాయించారు. అయితే గ్రామ సమగ్రాభివృద్ధికి సర్పంచ్‌ అభ్యర్థిని ఏకగ్రీవం చేసుకోవాలనే  సంకల్పం గ్రామస్తుల్లో బలపడింది. ఈ క్రమంలో ఈ నెల 16వ తేదీన గ్రామసభ ఏర్పాటు చేశారు.
చదవండి: తగ్గేదేలే..! తొలిసారి అసెంబ్లీ బరిలోకి సీఎం యోగి ఆదిత్యనాథ్‌ 

స్థానిక జగన్నాథ మందిరం ఆవరణ వేదికగా జరిగిన ఈ సమావేశానికి పంచాయతీలో 3 గ్రామాల ప్రజలు(ఓటర్లు), ఔత్సాహిక సర్పంచ్‌ అభ్యర్థులు హాజరయ్యారు. తర్వాత సర్పంచ్‌ పదవి కోసం వేలం పాట ప్రారంభించారు. గ్రామ ప్రగతి కోసం పలువురు ఔత్సాహిక అభ్యర్థులు ముందస్తు ఆర్థికపరమైన హామీలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉత్సాహం కనబరిచారు. మొత్తం నలుగురు వ్యక్తులు సర్పంచ్‌ పదవి కోసం వేలం పాటలో పాల్గొని, పోటీపడగా చివరికి సుశాంత ఛత్రియా అనే వ్యక్తి అధిక వేలం పాటతో సర్పంచ్‌ పదవిని దక్కించుకున్నట్లు సమాచారం. 

రూ.7 లక్షల నుంచి మొదలై.. 
త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఆయన మాత్రమే సర్పంచ్‌ అభ్యర్థి అని, వేరెవ్వరూ ఆ పదవి కోసం నామినేషన్లు దాఖలు చేయకూడదన్నది వేలం పాట ఒప్పందం. దీంతో సుశాంత ఛత్రియానే బిలెయిసొర్డా పంచాయతీ సర్పంచ్‌ అని స్థానికంగా వినిపిస్తోంది. సర్పంచ్‌ పదవి కోసం రూ.7 లక్షల నుంచి మొదలైన వేలం పాట ఆఖరికి రూ.44.10 లక్షలు ధర పలికినట్లు జోరుగా చర్చ సాగుతోంది. అయితే ఇదంతా అవాస్తవమని సుశాంత ఛత్రియా కొట్టిపారేశారు. గ్రామ ప్రగతికి విరాళంగా రూ.44 వేలు మాత్రమే తాను అందజేసేందుకు అంగీకరించినట్లు ఆయన తెలిపారు. తనను ఏకగ్రీవంగానే గ్రామసభ ఎన్నుకుంటుందన్న నమ్మకం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 
చదవండి: Punjab Assembly Election 2022: ఆప్‌కు ముప్పు: విజయావకాశాలను దెబ్బతీసేలా

నివేదిక దాఖలుకు ఆదేశాలు.. 
బిలైసొర్డా పంచాయతీ సర్పంచ్‌ పదవి వేలం పాట సంఘటనపై క్షేత్ర స్థాయిలో దర్యాప్తు నిర్వహించి, వాస్తవాలతో సమగ్ర నివేదిక దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్‌ జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. సర్పంచ్‌ పదవి రూ.44.10 లక్షలకు వేలం వేసినట్లు ప్రధాన ఆరోపణ కాగా, ఈ క్రమంలో దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, వాస్తవ, అవాస్తవాలను తెలియజేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి ఆర్‌.ఎన్‌.సాహు బొలంగీరు జిల్లా కలెక్టరు చంచల్‌ రాణాకు లేఖ జారీ చేయడం విశేషం.

గతంలోనూ ఏకగ్రీవమే.. 
ప్రధానంగా ఎన్నికల వ్యయం పరిమితం చేసేందుకు ఈ విధానానికి  గ్రామసభ ఏకీభవించింది. ఈసారి జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌ అభ్యర్థి గరిష్ట వ్యయ పరమితి రూ.2 లక్షలుగా ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అంతకన్నా తక్కువ ఖర్చుతో(రూ.44 వేలు) గ్రామంలో సర్పంచ్‌ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని ఆయన సర్దిచెప్పుకొచ్చాడు. 2017లో జరిగిన పంచాయతీ ఎన్నికలో ఇక్కడి సర్పంచ్‌గా రీతా బొఢియా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గమనార్హం. 

గుర్తింపు ఇవ్వలేం.. 
ఇలాంటి ప్రక్రియలో సర్పంచ్‌గా ఎన్నికైన వ్యక్తికి ఎటువంటి గుర్తింపు ఇవ్వలేమని స్థానిక అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి, సంబందిత ఫారం నింపాల్సి ఉంటుందన్నారు. ఇలా ఓ పద్ధతి ప్రకారం వెళ్లిన వ్యక్తికే సర్పంచ్‌ పదవి దక్కుతుందని, ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చని, ఆఖరికి వేలం పాటలో పాల్గొన్న వ్యక్తి అయినా కావొచ్చని అధికారులు తేల్చి చెప్పారు.

మరిన్ని వార్తలు