పార్టీని ఆధీనంలోకి తెచ్చుకుంటా

9 Feb, 2021 04:18 IST|Sakshi
జయలలితకు నివాళులర్పిస్తున్న శశికళ

ఎన్ని అడ్డంకులు ఎదురైనా అమ్మ ఆశీర్వాదంతో అధిగమిస్తా

శశికళ శపథం

బెంగళూరు నుంచి చెన్నై వరకు ఘనస్వాగతం

సాక్షి ప్రతినిధి, చెన్నై: క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెడతానని, అన్నాడీఎంకేను ఆధీనంలోకి తెచ్చుకుంటానని, తననెవరూ అడ్డుకోలేరని అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళ అన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించి గత నెల 27న విడుదలై బెంగళూరు శివార్లలోని రిసార్టులో రెస్ట్‌ తీసుకున్న శశికళ సోమవారం అర్ధరాత్రి చెన్నైకి చేరుకున్నారు. కృష్ణగిరి జిల్లా కందికుప్పంతోపాటూ పలు చోట్ల ఆమె కారులో నుంచే ప్రసంగించారు. ‘అణగదొక్కాలనే వారి ప్రయత్నాలు ఫలించవు. క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తా. త్వరలో మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు వివరిస్తా.

కార్యకర్తలకు, అభిమానులకు మాత్రమే నేను బానిసను. వారికి దాసోహం అవుతా. అమ్మ సమాధి సందర్శనకు వీలులేకుండా అకస్మాత్తుగా ఎందుకు మూసివేశారో ప్రజలందరికీ తెలుసు. అన్నాడీఎంకే పతాకాన్ని నేను వినియోగించడంపై పోలీసులకు ఆ పార్టీ నేతలు, మంత్రులు ఫిర్యాదు చేయడం వారిలో నెలకొన్న భయానికి నిదర్శనం. నా అభిమానులైన కార్యకర్తల సహకారంతో విజయం సాధించవచ్చు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అమ్మ ఆశీర్వాద బలంతో అధిగమిస్తా. ప్రాణం ఉన్నంతవరకు, తుదిశ్వాస విడిచేవరకు అఖిల భారత అన్నాడీఎంకే ద్వారా ప్రజా సంక్షేమాన్ని కాపాడుతా. కరోనా బారిన పడినా అమ్మ ఆశీర్వాదం వల్ల కోలుకున్నా’ అని అన్నారు.

అన్నాడీఎంకే పతాకంతోనే చిన్నమ్మ రాక
 సోమవారం ఉదయం 8 గంటలకు రిసార్టు నుంచి చెన్నైవైపు కారులోనే బయలుదేరారు. 10.45 గంటలకు ఆమె కారు తమిళనాడు సరిహద్దుల్లోకి ప్రవేశించగానే పోలీసులు ఆమె కారును అడ్డుకుని అన్నాడీఎంకే పతాకాన్ని తొలగించాలని కోరగా శశికళ నిరాకరించారు. అన్నాడీఎంకే తరపున పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన ఒక నేత ‘అది నా అధికారిక కారు, అడ్డుకునే హక్కు లేదు’అని వాదించడంతో పోలీసులు వెనక్కితగ్గారు. శశికళకు ఘన స్వాగతం పలికేందుకు వచ్చిన కార్లు రెండు బాణసంచాతో పేలడంతో కాలి బూడిదయ్యాయి. శశికళ రాకదృష్ట్యా చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటైంది.

కృష్ణగిరి జిల్లాలో శశికళకు స్వాగతం పలుకుతున్న మద్దతుదారులు, అభిమానులు

>
మరిన్ని వార్తలు