టోల్‌గేట్‌ వద్ద శశికళ నిరసన.. క్షమాపణలు చెప్పిన సిబ్బంది

10 Jul, 2022 11:52 IST|Sakshi

చెన్నై : చిన్నమ్మ శశికళకు కోపం వచ్చింది. టోల్‌ గేట్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థరాత్రి వేళ రోడ్డుపై నిరసనకు దిగారు. వివరాలు.. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ పురట్చి పయనానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. విస్తృతంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటిస్తూ, మద్దతుదారుల్ని ఏకం చేస్తూ, తన బలాన్ని చాటుకునే పనిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో శనివారం రాత్రి విల్లుపురం పర్యటన ముగించుకుని తిరుచ్చి వైపుగా బయలు దేరి వెళ్లారు. అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ఎనిమిది వాహనాలతో కూడిన ఆమె ప్రైవేట్‌ కాన్వాయ్‌ తిరుచ్చి తువ్వాకుడి టోల్‌ గేట్‌కు చేరుకుంది. ముందుగా వెళ్లున్న వాహనం టోల్‌ ‘గేట్‌’ను దాటింది. అయితే, చిన్నమ్మ వాహనానికి అడ్డుగా గేట్‌ పడటంతో వివాదం రేగింది. ఆమె ఉన్న వాహనం అద్దాలను తాకుతూ గేట్‌ వేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇదే టోల్‌ గేట్‌లో తనకు రెండుసార్లు అవమానం జరిగిందని, మరో మారు అదే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మద్దతుదారులు సైతం తగ్గేది లేదంటూ వాహనాలను రోడ్డు మధ్యలో ఆపేశారు. 

నిరసన.. బుజ్జగింపులు 
చిన్నమ్మ మద్దతుదారులు ఒక్క సారిగా టోల్‌గేట్‌ వైపు దూసుకు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. సిబ్బంది ప్రాణభయంతో పారిపోయారు. దీంతో టోల్‌లోని అన్ని గేట్లు మూత పడ్డాయి. వాహనాలు బారులు తీరడమే కాకుండా, కారులో నుంచి చిన్నమ్మ శశికళ నిరసనకు దిగారు. ఆమె మద్దతుదారులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు రంగంలోకి దిగి చిన్నమ్మను, ఆమె మద్దతు దారులను బుజ్జగించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. టోల్‌ గేట్‌ మేనేజర్‌ అమర్‌నాథ్‌ చిన్నమ్మకు క్షమాపణలు చెప్పినా చిన్నమ్మలో ఆగ్రహం తగ్గలేదు. తనపై కక్ష సాధింపు ధోరణి అనుసరిస్తున్నట్టుందని మండిపడ్డారు. ఫిర్యాదు ఇస్తే విచారించి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొనడంతో చిన్నమ్మ శాంతించారు. గంట తర్వాత ఆమె కాన్వాయ్‌ అక్కడి నుంచి కదిలింది.

ఇదీ చదవండి: అన్నాడీఎంకేలో వర్గపోరు.. నేనే అధినేత్రిని, మీడియాతో శశికళ వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు