శశికళ వ్యూహం.. పది కోట్ల జరిమానాకు రెడీ 

21 Oct, 2020 06:21 IST|Sakshi

కేవియేట్‌ పిటిషన్‌ దాఖలుకు కసరత్తు 

సాక్షి, చెన్నై: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు చిన్నమ్మ శశికళ వ్యూహ రచన చేశారు. న్యాయనిపుణులతో చర్చించి కేవియేట్‌ పిటిషన్‌ దాఖలు చేసేందుకు ఆమె ప్రతినిధులు నిమగ్నమయ్యారు. అక్రమాస్తుల కేసులో జైలు నుంచి జనవరిలో చిన్నమ్మ శశికళ విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో సోమవారం తన న్యాయవాది రాజా చెందూర్‌ పాండియన్‌కు చిన్నమ్మ రాసిన లేఖ వెలుగు చూసింది. ఇందులో ఆమె ఇచ్చిన సూచన ఆధారంగా సుప్రీంకోర్టులో కేవియేట్‌ పిటిషన్‌ దాఖలుకు కసరత్తులు సాగుతుండడం గమనార్హం. నాలుగేళ్లు జైలు శిక్ష పడడంతో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఆమెకు లేదు. దీంతో తనకు విధించిని శిక్షకు వ్యతిరేకంగా కేవియేట్‌ పిటిషన్‌ దాఖలుతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు తగిన వ్యూహాలకు చిన్నమ్మ వ్యూహం పన్నుతున్నట్టు తెలిసింది.  ('10 కోట్ల చెల్లింపునకు సిద్ధంగా ఉండండి')

అక్రమాస్తుల కేసు విచారణ ఒకే కోణంలో జరిగినట్టు, అన్ని కోణాల్లో పరిశీలించి విచారణ జరగాలని, అలాగే, శిక్ష విషయంగా పునస్సమీక్షించేందుకు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసేందుకు వ్యూహరచన జరుగుతున్నట్టు సమాచారం. చిన్నమ్మ ప్రతినిధి దినకరన్, న్యాయవాది రాజాచెందూర్‌ పాండియన్‌ ఢిల్లీలోని న్యాయవాదులు, న్యాయప్రతినిధులతో సంప్రదింపులకు సిద్ధమవుతున్నారు. చిన్నమ్మ విడుదల తర్వాత ఈ పిటిషన్‌ కోర్టుకు వెళ్లొచ్చని, అనుకూలంగా తీర్పు వచ్చిన పక్షంలో ఎన్నికల్లో చిన్నమ్మ పోటీ ఖాయమని అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం వర్గాలు పేర్కొంటున్నాయి. చిన్నమ్మ కోర్టుకు చెల్లించాల్సిన జరిమానా రూ.10కోట్లు సిద్ధంగా ఉందని న్యాయవాది రాజా చెందూర్‌ పాండియన్‌ తెలిపారు.  

దీప, దీపక్‌లకు నోటీసులు... 
దివంగత సీఎం జయలలితకు చెందిన వేదనిలయాన్ని అమ్మస్మారక మందిరంగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి వ్యతిరేకంగా జయలలిత మేనల్లు్లడు దీపక్, మేనకోడలు దీప కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే భవనం విలువ, జయలలిత చెల్లించాల్సిన ఆదాయపన్ను మొత్తం రూ.68 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెన్నై సిటీ సివిల్‌ కోర్టుకు చెల్లించింది. ఆ మొత్తాన్ని తీసుకోవాలని జయలలిత వారసులు దీప, దీపక్, ఆదాయపన్నుశాఖకు సిటీ సివిల్‌ కోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. నవంబర్‌ 5లోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి.  

మరిన్ని వార్తలు