ఉత్తరాఖండ్‌ ముంగిట మరో ముప్పు

13 Feb, 2021 03:50 IST|Sakshi

రిషిగంగ నదీ ప్రవాహంపై పడిన పర్వత చరియలు 

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో హిమానీనదం కారణంగా వరదలు ముంచెత్తినపుడు రిషిగంగ నదీ ప్రవాహమార్గంలో అత్యంత ప్రమాదకరమైన భారీ సరస్సు ఏర్పడిందని ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా వెల్లడైంది. నదీ ప్రవాహ మార్గంలో భారీగా రాళ్లు, మట్టి పడడంతో ప్రవాహం పాక్షికంగా ఆగి కృత్రిమంగా ఓ సరస్సు తయారైంది. ఈ సరస్సుతో మళ్లీ ముప్పు రాకుండా ఉండడానికి డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఒ), నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) సంయుక్తంగా ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగా ఎన్‌డీఆర్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌ఎన్‌ ప్రధాన్‌ ఎన్‌డీటీవీతో చెప్పారు.

ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తించిన ప్రాంతంలో సరస్సు ఎలా ఉంది, ఎంత ఉధృతంగా ప్రవహిస్తోందో తెలుసుకోవడం కోసం ఇప్పటికే కొన్ని బృందాలు హెలికాప్టర్ల ద్వారా పరిస్థితిని సమీక్షించాయి. డ్రోన్లు, మానవ రహిత విమానాల్ని కూడా ఆ ప్రాంతానికి పంపించి అవి తీసిన చిత్రాలు, వీడియోలను పరిశీలిస్తున్నట్టుగా ప్రధాన్‌ వెల్లడించారు. ఆ సరస్సు మహోగ్రరూపం దాల్చకుండా నిరోధించేలా డీఆర్‌డీఓ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌లు సంయుక్తంగా పని చేస్తున్నాయి. మరోవైపు ఈ సరస్సు వల్ల కలిగే ప్రమాదాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ చెప్పారు. ‘‘ఇప్పుడు మనం ఆందోళన పడకూడదు. అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే కొన్ని బృందాలు ఆ సరస్సు గురించి తెలుసుకునే పనిలో ఉన్నాయి’’అని రావత్‌ చెప్పారు.  

ఫుట్‌బాల్‌ స్టేడియం కంటే మూడింతలు పెద్దది
డ్రోన్లు, ఇతర విమానాలు తీసిన చిత్రాల్లో సరస్సు చాలా పెద్దదిగా కనిపిస్తోంది. ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌ కంటే మూడు రెట్లు పొడవున సరస్సు ప్రవహిస్తోంది. 350 మీటర్ల పొడవు, 60 మీటర్ల ఎత్తు, 10 డిగ్రీల లోతు ఉన్న ఈ సరస్సు నుంచి మంచు పెళ్లలు, బురద, రాళ్లతో కూడిన నీళ్లు రిషిగంగ నదిలోకి ప్రవహించి రెండు విద్యుత్‌ ప్లాంట్లను ధ్వంసం చేశాయి.

ఆ సమయంలో ఏర్పడిన కృత్రిమ సరస్సుని మట్టి పెళ్లలు, రాళ్లతో కూడిన శిథిలాలు అడ్డుగోడగా ఉన్నాయి. అయితే బుధవారం నాడు తీసిన శాటిలైట్‌ చిత్రాల్లో సరస్సు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ అడ్డుగోడని ఛేదించుకొని సరస్సు ప్రవహిస్తే ఏ స్థాయిలో ముప్పు జరుగుతుందో ఎవరి అంచనాకి అందడం లేదు.

ఆ సరస్సు చాలా ప్రమాదకరంగా మారుతోందని శాటిలైట్‌ చిత్రాలను పరిశీలించిన ఘర్వాల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ వైపీ సండ్రియల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘నేను రిషిగంగ నదికి ఈశాన్యంవైపు ఉన్నాను. ఆ పై నుంచే నీటి ప్రవాహం ముంచుకొస్తోంది. ప్రస్తుతానికి రాళ్లు ఒక గోడలా అడ్డుగా ఉండడం ఊరట కలిగించే అంశం. కానీ ఏ క్షణంలోనైనా అది కొట్టుకుపోతే చాలా ప్రమాదం. సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది’’అని చెప్పారు.  

38కి చేరుకున్న మృతుల సంఖ్య  
ఉత్తరాఖండ్‌లోని తపోవన్‌ సొరంగ మార్గం దగ్గర వరుసగా ఆరో రోజు సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. లోపల చిక్కుకున్న 30–35 మందిని కాపాడడానికి సహాయ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారు. సొరంగానికి అడ్డంగా కొట్టుకొచ్చిన రాళ్లను డ్రిల్లింగ్‌ చేయడం, బురదని తోడడం వంటి పనులు ఏక కాలంలో నిర్వహిస్తున్నట్టుగా ఉత్తరాఖండ్‌ డీజీపీ అశోక్‌ కుమార్‌ చెప్పారు. వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా తాము ముందుకు వెళుతున్నామని తెలిపారు. మరోవైపు శుక్రవారం నాడు మరో రెండు మృతదేహాలు లభ్యమవడంతో మృతుల సంఖ్య 38కి చేరుకుంది. మరో 166 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. రిషిగంగ హైడల్‌ ప్రాజెక్టు దగ్గర ఒక మృతదేహం లభిస్తే, మైథన ప్రాంతంలో మరొకటి గుర్తించినట్టుగా సహాయ బృందాలు తెలిపాయి. సొరంగ మార్గంలో చిక్కుకున్న కార్మికుల కుటుంబాల ఆవేదనకు అంతే లేదు. లోపల వాళ్లు ఏ స్థితిలో ఉన్నారో ఊహించుకోవడానికే వారు భయపడుతున్నారు. ఎన్‌టీపీసీ ప్రాజెక్టు తమ ప్రాంతానికి ఒక శాపంగా మారిందని స్థానికులు అంటున్నారు. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్న ప్రాంతానికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్‌టీపీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తపోవన్‌ గ్రామ సభకు చెందిన మహిళలు అత్యధికులు వచ్చి తమ నిరసన తెలిపారు. మొదట మా పొలాలను పోగొట్టుకున్నాం, ఇప్పుడు మా ప్రియమైన వారినే పోగొట్టుకున్నామంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. 

మరిన్ని వార్తలు