సావిత్రీ జిందాల్‌..: ఆసియాలోకెల్లా సంపన్నురాలు

31 Jul, 2022 05:02 IST|Sakshi

నికర సంపద రూ.89,490 కోట్లు

న్యూఢిల్లీ: జిందాల్‌ గ్రూప్‌ చైర్‌పర్సన్‌ సావిత్రీ జిందాల్‌ (72) ఆసియాలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. ఐదేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న చైనాలోని అతి పెద్ద రియల్టీ దిగ్గజం కంట్రీ గార్డెన్‌ హోల్డింగ్స్‌ కో చైర్‌పర్సన్‌ యాంగ్‌ హుయాన్‌ (41) మూడో స్థానానికి పడిపోయారు. చైనాకే చెందిన మరో వ్యాపార దిగ్గజం ఫాన్‌ హాంగ్‌వియ్‌ (55) రెండో స్థానానికి ఎగబాకారు.

బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్ల తాజా సూచీ ఈ మేరకు పేర్కొంది. జిందాల్, ఫాన్‌ నికర సంపద 11.3 బిలియన్‌ డాలర్లు (రూ.89,490 కోట్లు) కాగా యాంగ్‌ సంపద 11 బిలియన్‌ డాలర్లకు (రూ.87,114 కోట్లకు) పడిపోయినట్టు తెలిపింది. ఈ ఏడాది మొదట్లో ఏకంగా 23.7 బిలియన్‌ డాలర్లున్న యాంగ్‌ సంపద విలువ చైనా రియల్టీ సంక్షోభానికి అద్దం పడుతూ ఏడు నెలల్లోనే 50 శాతానికి పైగా పడివడం గమనార్హం!

ఆమె సంపద ఒక దశలో ఒక్క రోజులోనే 100 కోట్ల డాలర్ల మేరకు హరించుకుపోయింది! కరోనా నేపథ్యంలో సావిత్రీ జిందాల్‌ ఆస్తులు కూడా విపరీతమైన హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. 2020 ఏప్రిల్లో ఏకంగా 3.2 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. రెండేళ్లలో 15.6 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. 2005లో భర్త ఓపీ జిందాల్‌ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడంతో ఆమె కంపెనీ బాధ్యతలు చేపట్టారు. అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో సావిత్రి పదో స్థానంలో ఉన్నారు.

సాధికారతకు ప్రతిరూపం
72 ఏళ్ల సావిత్రీ జిందాల్‌ మహిళా సాధికారతకు ప్రతిరూపమని చెప్పొచ్చు. ఆమె 1950 మార్చి 20న అసోంలోని తిన్‌సుకియా పట్టణంలో జన్మించారు. 1970లో ఓపీ జిందాల్‌ను పెళ్లాడారు. 50 ఏళ్ల క్రితం హరియాణాలోని హిస్సార్‌లో బకెట్ల తయారీ ప్లాంటుతో కెరీర్‌ మొదలు పెట్టిన ఓపీ జిందాల్‌ కొన్నేళ్లలోనే దాన్నో భారీ వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించారు. భర్త మరణానంతరం 2005లో సంస్థ పగ్గాలు చేపట్టడంతో పాటు కాంగ్రెస్‌లో చేరడం ద్వారా ఆయన రాజకీయ వారసత్వాన్నీ కొనసాగించారు.

హిస్సార్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై హరియాణా అసెంబ్లీలో అడుగు పెట్టారు. మంత్రిగా కూడా పని చేశారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆమె సారథ్యంలో కంపెనీ నికర విలువ ఏకంగా నాలుగింతలు పెరిగింది. అయితే స్టీల్, సిమెంటు, ఇంధన, ఇన్‌ఫ్రా వంటి పలు రంగాల్లో విస్తరించిన జిందాల్‌ వ్యాపార సామ్రాజ్యాన్ని విజయవంతంగా నడుపుతున్న సావిత్రి కాలేజీ చదువు కూడా చదవకపోవడం విశేషం.

జిందాల్స్‌ది పక్కా సంప్రదాయ కుటుంబం కావడంతో భర్త ఉండగా ఎన్నడూ తెరపైకి రాకుండా గడిపారామె! కనీసం భర్తను ఎన్నడూ ఎంత సంపాదిస్తున్నారని కూడా అడిగి ఎరగనంటారు! జిందాల్‌ కుటుంబంలో మహిళలు పెద్దగా బయటికే రారని 2010లో ఫోర్బ్స్‌ మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సావిత్రి స్వయంగా చెప్పారు కూడా. ‘‘మా కుటుంబంలో బయటి పనులన్నీ మగవాళ్లే చూసుకుంటారు.

ఆడవాళ్లం ఇంటి బాధ్యతలకు పరిమితమవుతాం. మా ఆయన ఉండగా నేనెప్పుడూ కనీసం (స్థానిక) హిస్సార్‌ మార్కెట్‌కు కూడా వెళ్లింది లేదు! మార్కెట్లో ఉండేవాళ్లంతా మా బంధువులేనని, పైగా నాకంటే పెద్దవాళ్లని మా ఆయన చెబుతుండేవారు. మా కుటుంబంలో మహిళలు పెద్దలతో మాట్లాడకూడదన్నది ఓ మర్యాద’’ అని వివరించారు. కంపెనీ వ్యాపార బాధ్యతలను కుమారులు పృథ్వీరాజ్, సజ్జన్, రతన్, నవీన్‌ జిందాల్‌ చూసుకుంటారు.

భర్త మాదిరిగానే ఆమె కూడా సామాజిక కార్యకలాపాల్లో నిత్యం చురుగ్గా ఉంటారు. ఫ్యాక్టరీలు పెట్టిన ప్రతి చోటా విధిగా స్థానికుల కోసం స్కూలు, ఆస్పత్రి కూడా స్థాపించడం జిందాల్స్‌ పాటిస్తూ వస్తున్న సంప్రదాయం. తమ కంపెనీల్లో పని చేసేవాళ్లు కూడా కుటుంబంలో భాగమేనన్న ఓపీ జిందాల్‌ ఫిలాసఫీని సావిత్రి కూడా తూచా తప్పకుండా పాటిస్తుంటారు.

యాంగ్‌ అలా...
మరోవైపు ఐదేళ్ల పాటు ఆసియా సంపన్న మహిళల్లో టాప్‌గా నిలిచిన 41 ఏళ్ల యాంగ్‌ మాత్రం సావిత్రికి భిన్నంగా లో ప్రొఫైల్‌లో గడుపుతుంటారు. ఇంతటి సోషల్‌ మీడియా యుగంలోనూ కనీసం ఆమెకు సంబంధించిన ఫొటోలు కూడా ఇంటర్నెట్లో పెద్దగా అందుబాటులో లేవంటే యాంగ్‌ది ఎంతటి ప్రైవేట్‌ జీవితమో అర్థం చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు