ఇక వడ్డీ రేట్లు పైపైకే..!

18 Dec, 2021 04:58 IST|Sakshi

సరళతర విధానానికి ‘చెల్లుచీటీ’ సంకేతాలు!

ఎస్‌బీఐ డిపాజిట్‌ రేట్ల పెంపు

రూ.2 కోట్లు పైబడిన డిపాజిట్లపై 0.1 శాతం అదనం

7.55 శాతానికి అప్‌

ఇందుకు అనుగుణంగా బేస్‌ రేటూ పెరుగుదల

10 బేసిస్‌ పాయింట్ల పెంపుతో  7.55కు జంప్‌

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మరెంతోకాలం సరళతర ద్రవ్య, పరపతి విధానాన్ని కొనసాగించలేదన్న సంకేతాలు అందుతున్నాయి.  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) వడ్డీరేట్ల పెంపు దిశగా తీసుకున్న నిర్ణయం ఇందుకు నిదర్శనం. మరికొన్ని బ్యాంకులూ దీనిని అనుసరించే అవకాశం ఉంది. ఎస్‌బీఐ  విషయానికి వస్తే  కొన్ని డిపాజిట్‌ రేట్లను– రుణరేట్లను  పెంచుతూ బ్యాంకింగ్‌ దిగ్గజం కీలక నిర్ణయాలు తీసుకుంది. తాను ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటుకు సంబంధించిన బేస్‌ రేటునూ 10 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు 1%) పెంచింది.

దీనితో బెంచ్‌మార్క్‌ లెండింగ్‌ రేటు లేదా బేస్‌ రేటు 7.55 శాతానికి చేరింది.  ఎస్‌బీఐ వెబ్‌సైట్‌ ఈ విషయాన్ని తెలిపింది. బేస్‌ రేటు అంటే ఒక బ్యాంక్‌ అనుసరించే కనీస వడ్డీరేటు. బేస్‌ రేటుకు అనుసంధానమైన వడ్డీరేట్లు ఇంతకన్నా (బేస్‌ రేటు) తక్కువ ఉండవు. కొత్త రేటు డిసెంబర్‌ 15వ తేదీ నుంచే అమల్లోకి వస్తుందని కూడా బ్యాంక్‌ వెబ్‌సైట్‌ వివరించింది. గడచిన రెండేళ్లలో ఎస్‌బీఐ బేస్‌ రేటును పెంచడం ఇదే తొలిసారి. అయితే ఎస్‌బీఐ మొత్తం రుణాల్లో బేస్‌ రేటుకు అనుసంధానమై ఉన్నవి కేవలం 2.5% మాత్రమే కావడం గమనార్హం.  

2019 జనవరి ముందు రుణాలకు వర్తింపు
 కాగా తాజా నిర్ణయం  జనవరి 2019 నుండి రుణం తీసుకున్న వారికి వర్తించదు. అంతకుముందు రుణం తీసుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. వడ్డీరేట్ల విధానంలో పారదర్శకతే లక్ష్యంగా  2019 జనవరి నుంచీ బేస్‌ రేటు విధానం నుంచి ఎస్‌బీఐ ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ లెండింగ్‌ రేటు (ఈబీఎల్‌ఆర్‌) విధానానికి మారింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 4 శాతం)కు ఈబీఎల్‌ఆర్‌ అనుసంధానమై ఉంటుంది. రెపో రేటు మార్పులకు అనుగుణంగా ఈబీఎల్‌ఆర్‌ ఉంటుంది. ద్రవ్యోల్బణం కట్టడి, రుణ, డిమాండ్, ఎకానమీ వృద్ధి లక్ష్యంగా గడచిన తొమ్మిది ద్వైమాసిక సమావేశాల్లో సరళతర ద్రవ్య పరపతి విధానాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా కీలక రేటులో ఎటువంటి మార్పూ చేయలేదు.  

బెంచ్‌మార్క్‌ ప్రైమ్‌ లెండింగ్‌ కూడా...
బేస్‌ రేటు విధానం ప్రారంభానికి (2010 జూలై 1) ముందు అమల్లో ఉన్న బెంచ్‌మార్క్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటు (బీపీఎల్‌ఆర్‌)నూ 10 బేసిస్‌ పా యింట్లు అంటే 12.2% నుంచి 12.3 %కి పెంచింది.  

డిపాజిట్‌ రేటు పెంపు తీరు..
మరోవైపు రూ.2 కోట్లు పైబడి విలువ కలిగిన డిపాజిట్లపై ఎస్‌బీఐ వడ్డీరేటు 10 బేసిస్‌ పాయింట్లు (0.1 శాతం) పెరిగింది. దీనితో ఈ రేటు 7.55 శాతానికి చేరింది. డిసెంబర్‌ 15వ తేదీ నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది.

ఇప్పటికే కొన్ని బ్యాంకులు...
రెండు పెద్ద నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ)– బజాజ్‌ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ ఐదు సంవత్సరాల వరకూ డిపాజిట్లపై ఈ నెలారంభంలో వడ్డీరేట్లను 30 బేసిస్‌ పాయింట్లు పెంచాయి. డిసెంబర్‌ 10 నుంచీ అమల్లోకి వచ్చే విధంగా  కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ గృహ రుణ వడ్డీరేటును స్వల్పంగా 0.05 శాతం పెంచింది.  దీనితో బ్యాంక్‌ గృహ రుణ రేటు 6.50 శాతం నుంచి 6.55 శాతానికి పెరిగింది.   

కీలక సమయం ఆసన్నం
ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, సెంట్రల్‌ బ్యాంకులు ప్రస్తుతం అన్ని సమస్యలకు ఒకేఒక్క ఔషధం కలిగి ఉన్నాయి. అది కరెన్సీ ముద్రణ. చౌక రుణ లభ్యత. వాతావరణ మార్పులాగా ఇది భవిష్యత్‌ తరానికి సంబంధించిన సమస్య. మనం దీనిని పరిష్కరించాలి. అయితే ఇక్కడ క్లిష్ట సమస్యలను ఎదుర్కొనవద్దని లేదా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం నుంచి వైదొలగాలని చెప్పడం ఉద్దేశ్యం కాదు. భవిష్యత్తు ప్రయోజనాలు ఇక్కడ ముడివడి ఉన్నాయి. ఇప్పుడు కీలక నిర్ణయాలకు సమయం ఆసన్నమైంది.
ఉదయ్‌ కోటక్, కోటక్‌ బ్యాంక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్, ఎండీ

మరెంతో కాలం సాగదు...
మహమ్మారి నేపథ్యంలో మనం అతి తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థను చూశాం. అయితే ఇది ఎంతోకాలం సాగా పరిస్థితి లేదు. బ్యాంకులు తమ వద్ద ఉన్న అదనపు నిధులకు సంబంధించి ఆర్‌బీఐ రివర్స్‌ రెపో మార్గంలో పొందుతున్న వడ్డీరేట్లలో పెరుగుదలను ఇప్పటికే మనం చూస్తున్నాం. ఈ రేటు 3.35 శాతం నుంచి 3.5 శాతానికి పెరిగింది. ఈ స్థాయి నుంచి రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ జరిగే పాలసీ సమీక్ష నిర్ణయాలపై బ్యాంకింగ్‌ వేచి చూస్తోంది
– అశిష్‌ పార్థసారథి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ట్రజరీ చీఫ్‌

ఒక శాతం పెరిగే అవకాశం
భారత్‌ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2022–23) సరళతర విధానాల నుంచి వెనక్కు మళ్లే అవకాశం ఉంది.  బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) ఒక శాతం పెరగవచ్చు.  2022ని భారతదేశం ‘సాధారణ పాలసీ సంవత్సరంగా’ పరిగణిస్తోంది. వినియోగం ద్వారా వృద్ధి రికవరీ పటిష్టం అవుతుందని భావిస్తున్నాం. 2–6 శాతం శ్రేణిలోనే ద్రవ్యోల్బణం ఉంటుంద్నది మా అభిప్రాయం.
– బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా నివేదిక

మరిన్ని వార్తలు