డిగ్రీ అర్హతతో 5,008 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

20 Sep, 2022 21:26 IST|Sakshi

ఎస్‌బీఐలో జూనియర్‌ అసోసియేట్‌ కొలువు

5,008 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

రెండు దశల ఎంపిక ప్రక్రియ ద్వారా నియామకం

తొలిసారిగా ప్రాంతీయ భాషల్లోనూ రాత పరీక్షలు

బ్యాంకు కొలువుల అభ్యర్థులకు..శుభవార్త! దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఐదువేలకుపైగా జూనియర్‌ అసోసియేట్‌ (కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రెండు దశల రాత పరీక్ష ద్వారా నియామకాలు ఖరారు చేయనుంది. దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. ఎస్‌బీఐ జూనియర్‌ అసోసియేట్స్‌ నోటిఫికేషన్‌ వివరాలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానంతో పాటు విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌.. 

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రతి ఏటా క్రమం తప్పకుండా క్లరికల్, పీవో (ప్రొబేషనరీ ఆఫీసర్‌), స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతోంది. కాబట్టి ఐబీపీఎస్, ఎస్‌ఎస్‌సీ వంటి పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు అదే ప్రిపరేషన్‌తో.. ఎస్‌బీఐ జూనియర్‌ అసోసియేట్‌ ఉద్యోగాలకు కూడా పోటీ పడొచ్చు. 

ఐదు వేలకుపైగా పోస్టులు
ఎస్‌బీఐ మొత్తం 5,008 జూనియర్‌ అసోసియేట్‌ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిలో హైదరాబాద్‌ సర్కిల్‌లో 225 పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి.

అర్హతలు
►నవంబర్‌ 30,2022 నాటికి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. 
వయసు: ఆగస్ట్‌ 1, 2022 నాటికి 18–28 ఏళ్లుగా ఉండాలి. ఎస్‌సీ/ఎస్‌టీ కేటగిరీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

తొలిసారి ప్రాంతీయ భాషల్లో
ఎస్‌బీఐ జూనియర్‌ అసోసియేట్స్‌ తాజా నోటిఫికేషన్‌లో ప్రధానంగా ప్రస్తావించాల్సిన అంశం.. తొలిసారిగా పరీక్షలను ్ర΄ాంతీయ భాషల్లో నిర్వహించనుండడం. తెలుగు సహా మొత్తం ఇరవై భాషల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న భాషలో పరీక్షకు హాజరు కావచ్చు. హైదరాబాద్‌ సర్కిల్‌లో పరీక్ష రాయాలనుకునే వారు తెలుగు లేదా ఉర్దూ మీడియంలను ఎంచుకునే అవకాశముంది.

రెండు దశల రాత పరీక్ష
ఎస్‌బీఐ జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులకు రెండు దశల రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ముందుగా ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. అందులో సాధించిన ఉత్తీర్ణత, కటాఫ్‌ లిస్ట్‌ ఆధారంగా..తదుపరి దశలో జరిపే మెయిన్‌ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అంతిమంగా మెయిన్‌లో చూపిన ప్రతిభ ఆధారంగానే నియామకాలు ఖరారు చేస్తారు.

స్థానిక భాష పరీక్ష
అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యే మాధ్యమాన్ని దరఖాస్తు సమయంలోనే తెలియజేయాల్సి ఉంటుంది. దాని ఆధారంగానే పరీక్ష పేపర్‌ మాధ్యమం ఉంటుంది. మాతృ భాష కాకుండా.. వేరే భాషలో పరీక్ష రాసిన అభ్యర్థులకు.. మెయిన్‌ ఎగ్జామ్‌ తర్వాత స్థానిక భాష పరీక్ష నిర్వహిస్తారు.

ప్రిలిమినరీ 100 మార్కులు
ఎంపిక ప్రక్రియలో తొలి దశ రాత పరీక్ష.. ప్రిలిమినరీ. మూడు విభాగాలుగా ఆన్‌లైన్‌లో మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలు–30 మార్కులు, న్యూమరికల్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు ప్రిలిమ్స్‌ పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 60 నిమిషాలు. పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ మినహా మిగతా విభాగాలకు సంబంధించి.. అభ్యర్థులు తమ రాష్ట్రానికి చెందిన లేదా తాము దరఖాస్తు చేసుకున్న రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతీయ భాషలో పరీక్ష రాయొచ్చు.

200 మార్కులకు మెయిన్‌
తొలిదశ రాత పరీక్ష ప్రిలిమినరీలో చూపిన ప్రతిభ ఆధారంగా 1:10 నిష్పత్తిలో (ఒక్కో పోస్ట్‌కు పది మందిని చొప్పున) తదుపరి దశ మెయిన్‌ ఎగ్జామ్‌కు ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉండే మెయిన్‌ పరీక్ష మొత్తం నాలుగు విభాగాల్లో 200 మార్కులకు జరుగుతుంది. జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలు–50 మార్కులు, జనరల్‌ ఇంగ్లిష్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు–50 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు–60 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం 2గంటల 40 నిమిషాలు. మెయిన్‌ ఎగ్జామ్‌లోనూ అభ్యర్థులు జనరల్‌ ఇంగ్లిష్‌ మినహా మిగతా విభాగాలను తమకు ఆసక్తి, అర్హత ఉన్న ప్రాంతీయ భాషలో హాజరయ్యే అవకాశం ఉంది.

నవంబర్‌లో పరీక్ష.. సన్నద్ధత ఇలా
ఎస్‌బీఐ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం–ప్రిలిమినరీ పరీక్ష నవంబర్‌లో జరుగనుంది. మెయిన్‌ మాత్రం ఈ ఏడాది డిసెంబర్‌ లేదా వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించే అవకాశం ఉంది. అంటే..ప్రిలిమ్స్‌కు గరిష్టంగా రెండు నెలలు, మెయిన్స్‌కు మూడు లేదా నాలుగు నెలల సమయం అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు ముందుగా ప్రిలిమినరీ పరీక్ష తేదీ వరకు.. ప్రిలిమ్స్, మెయిన్స్‌ రెండింటిలో ఉన్న సబ్జెక్ట్‌లకు ప్రిపరేషన్‌ సాగించాలి. ఆ తర్వాత పూర్తిగా మెయిన్స్‌పై దృష్టి పెట్టాలి. మెయిన్‌ పరీక్షలో మాత్రమే ఉన్న జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్, కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ విభాగాలకు ప్రత్యేక సమయం కేటాయించాలి. 

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌
అభ్యర్థుల ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను పరిశీలించే విభాగం ఇది. ఇందులో రాణించాలంటే.. బేసిక్‌ గ్రామర్‌పై అవగాహన ఉండాలి. అదేవిధంగా ఇడియమ్స్, సెంటెన్స్‌ కరెక్షన్, వొకాబ్యులరీ, సెంటెన్స్‌ రీ అరేంజ్‌మెంట్, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూట్స్‌పై పట్టు సాధించాలి. జనరల్‌ ఇంగ్లిష్‌ నైపుణ్యం పెంచుకోవాలి. ఇందుకోసం ఇంగ్లిష్‌ దినపత్రికలు చదవడం, వాటిలో వినియోగిస్తున్న పదజాలం, వాక్య నిర్మాణం వంటి వాటిపై దృష్టి పెట్టాలి.

న్యూమరికల్‌ ఎబిలిటీ
పరీక్షలో మరో కీలక విభాగం ఇది. మెయిన్‌లో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ విభాగానికి సరితూగే విభాగంగా దీన్ని పేర్కొనొచ్చు. ఇందులో ప్రధానంగా అర్థమెటిక్‌ అంశాలు (పర్సంటేజెస్, నిష్పత్తులు, లాభ–నష్టాలు, నంబర్‌ సిరీస్, బాడ్‌మాస్‌ నియమాలు)పై పట్టు సాధించేలా ్ర΄ాక్టీస్‌ చేయాలి. వీటితో΄ాటు డేటాఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలిసిస్‌లనూ సాధన చేయాలి.

రీజనింగ్‌
ఈ విభాగం ప్రిలిమ్స్, మెయిన్స్‌ రెండింటిలోనూ ఉంటుంది. ఇందులో మంచి మార్కుల సాధనకు కోడింగ్‌–డీకోడింగ్, బ్లడ్‌ రిలేషన్స్, డైరెక్షన్, సిలాజిజమ్‌ విభాగాలను బాగా ప్రాక్టీస్‌ చేయాలి.

జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌
మెయిన్‌లోనే ఉండే ఈ విభాగంలో రాణించాలంటే.. బ్యాంకింగ్‌ రంగంలో తాజా పరిణామాలు, విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బ్యాంకింగ్‌ రంగంలోని అబ్రివేషన్లు, పదజాలం, విధులు, బ్యాంకులకు సంబంధించిన కొత్త విధానాలు, కోర్‌ బ్యాంకింగ్‌కు సంబంధించిన చట్టాలు, విధానాలు, రిజర్వ్‌ బ్యాంకు విధులు వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. జనరల్‌ అవేర్‌నెస్‌లో.. కరెంట్‌ అఫైర్స్, స్టాక్‌ జనరల్‌ నాలెడ్జ్‌ కోణంలోనూ ఎకానమీ, ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌
కంప్యూటర్‌ నాలెడ్జ్‌ను పరీక్షించే ఉద్దేశంతో మెయిన్‌లో మాత్రమే ఉండే విభాగం ఇది. ఈ విభాగానికి సంబంధించి ప్రధానంగా కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్, కంప్యూటర్‌ స్ట్రక్చర్, ఇంటర్నెట్‌ సంబంధిత అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాలి. కీ బోర్డ్‌ షాట్‌ కట్స్, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ సంబంధిత అంశాల(సీపీయూ, మానిటర్, హార్డ్‌ డిస్క్‌ తదితర) గురించి తెలుసుకోవాలి.

గత ప్రశ్న పత్రాల సాధన
అభ్యర్థులు గత ప్రశ్న పత్రాల సాధన, మాక్‌ టెస్ట్‌లకు హాజరు కావడం ఉపయుక్తంగా ఉంటుంది. ఫలితంగా ఏ టాపిక్‌కు ఎంత వెయిటేజీ ఉందో తెలుస్తుంది. అంతేకాకుండా సమాధానాలను సరి చూసుకోవడం ద్వారా తాము ఇంకా అవగాహన ΄÷ందాల్సిన అంశాలపై స్పష్టత లభిస్తుంది. మాక్‌ టెస్ట్‌లకు హాజరవడం వల్ల టైమ్‌ మేనేజ్‌మెంట్‌ కూడా అలవడుతుంది. ఇలా ఇప్పటి నుంచే మెయిన్‌ ఎగ్జామినేషన్‌ దృక్పథంతో చదివితే.. ప్రిలిమ్స్‌లో సులువుగా నెగ్గడానికి, ఆ తర్వాత మెయిన్‌లో రాణించడానికి అవకాశం ఉంటుంది. 

ముఖ్య సమాచారం
►దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
►ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్‌ 27, 2022
►ప్రిలిమినరీ పరీక్ష తేదీ: నవంబర్, 2022లో 
►మెయిన్‌ పరీక్ష తేదీ: డిసెంబర్‌ 2022 లేదా జనవరి 2023లో 
►పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://bank.sbi/careers, https://www.sbi.co.in/careers

మరిన్ని వార్తలు