ఎన్నికల బాండ్లు: ‘ఆర్‌టీఐ’ దరఖాస్తుకు సమాధానమివ్వని ఎస్‌బీఐ

2 Apr, 2024 21:29 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల అమ్మకాల స్టాండర్డ్ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌(ఎస్‌ఓపీ) తెలపాలని సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) కింద  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కి ఒక పిటిషన్‌ దాఖలైంది. ఎస్‌ఓపీ వివరాలు ఇవ్వడానికి ఎస్‌బీఐ నిరాకరించింది.  హక్కుల కార్యకర్త అంజలి భరద్వాజ్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. బాండ్ల విక్రయాలు, ఎన్‌క్యాష్‌ కోసం బ్యాంకు బ్రాంచ్‌లకు జారి చేసిన ఎస్‌ఓపీ అనేది  తమ సంస్థ అంతర్గత మార్గదర్శకాల కిందకు వస్తుందని ఎస్‌బీఐ పిటిషనర్‌కు సమాధానమిచ్చింది.

వాణిజ్య, వ్యాపార రహస్యాలు వెల్లడించకుండా కమర్షియల్‌ కాన్ఫిడెన్స్‌ కింద ఆర్‌టీఐ చట్టంలో మినహాయింపులున్నాయని తెలిపింది. ఎస్‌బీఐ సమాధానంపై అంజలి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల బాండ్లను రాజ్యాంగ విరుద్ధమని ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పిందని, వీటికి సంబంధించిన అన్ని వివరాలు బహిర్గతం చేయాలని ఆదేశించిందని గుర్తు చేశారు.

అయినా ఎస్‌బీఐ ఎస్‌ఓపీ వివరాలు దాచడం సరికాదన్నారు. కాగా, రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 15న ప్రకటించిన విషయం తెలిసిందే. స్కీమ్‌ను  ఎన్నికల బాండ్ల వివరాలు ఎన్నికల కమిషన్‌(ఈసీ)కి అందజేయాలని ఎస్‌బీఐని కోర్టు ఆదేశించింది. దీంతో ఎస్‌బీఐ ఈసీకి వివరాలు అందించిన వెంటనే ఈసీ వాటిని తన వెబ్‌సైట్‌లో బహిర్గతం చేసింది.   

ఇదీ చదవండి.. వదలని చిక్కులు.. మహువా మొయిత్రాపై మరో కేసు 

Election 2024

మరిన్ని వార్తలు