మా సిఫార్సులు రైతు అనుకూలం!

9 Sep, 2021 06:01 IST|Sakshi

సాగు చట్టాలపై సుప్రీం కమిటీ సభ్యుడు ఘనావత్‌

న్యూఢిల్లీ: రైతు చట్టాలపై అధ్యయనానికి సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నివేదిక వందశాతం రైతులకు అనుకూలమని కమిటీలో కీలక సభ్యుడొకరు వెల్లడించారు. సుప్రీంకోర్టు త్వరలో ఈ విషయాన్ని ఎలాంటి జాప్యం లేకుండా విచారించాలని కోరారు. కమిటీ నివేదిక బహిర్గతం చేయడం వల్ల తలెత్తే అవకాశమున్న చట్టపరమైన సమస్యలను సుప్రీం, కేంద్రం పరిగణించి కొంత సమయం తీసుకోవచ్చని, అయితే పూర్తిగా నివేదికను బుట్టదాఖలా చేయడం కుదరదని, అలా చేయకూడదని కమిటీ సభ్యుడు అనీల్‌ జే ఘనావత్‌ అభిప్రాయపడ్డారు. అందరూ ఆందోళనచెందుతున్నట్లు కొత్త చట్టాలతో ఎంఎస్‌పీ(కనీస మద్దతు ధర) రద్దు కాదని, కొత్త చట్టంలో అసలు ఎంఎస్‌పీ అంశమే లేదని చెప్పారు.

నివేదికను ప్రజల్లో ఉంచాలని సెపె్టంబర్‌1న ఆయన సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అలాగని ప్రభుత్వం తెచి్చన మూడు చట్టాలను పూర్తిగా రద్దు చేయాలన్న వాదనకు కమిటీ మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు. అయితే చట్టాల్లో పలు లోపాలున్నట్లు తమ కమిటీ పరిశీలనలో తేలిందని వివరించారు. వీటిని పరిష్కరించాల్సిఉందని సూచించారు. అందువల్ల సుప్రీంకోర్టు వెంటనే నివేదికను బహిర్గతం చేయాలని కోరినట్లు తెలిపారు. మూడు వ్యవసాయ చట్టాల అధ్యయనానికి 2021 జనవరిలో ఒక కమిటీని రూపొందించింది. ఇందులో షెట్కారీ సంఘటన నాయకుడైన ఘనావత్‌ ఒక సభ్యుడు. ఈయనతో పాటు సీఏసీపీ మాజీ చైర్మన్‌ అశోక్‌ గులాటి, ఐఎఫ్‌పీఆర్‌ఐకి చెందిన ప్రమోద్‌ కుమార్‌ కమిటీలో ఉన్నారు.

మరిన్ని వార్తలు