పెళ్లి చేసుకుంటావా.. జైలుకెళ్తావా?‌: సుప్రీంకోర్టు

1 Mar, 2021 16:13 IST|Sakshi
సుప్రీం కోర్టు (ఫైల్‌ ఫోటో)

పోక్సో యాక్ట్‌ కింద అరెస్ట్‌ అయిన ప్రభుత్వ ఉద్యోగి

అరెస్ట్‌ నుంచి రక్షణ కోరుతూ సుప్రీంకోర్టుకి

న్యూఢిల్లీ: అత్యాచార ఆరోపణల నేపథ్యంలో పోక్సో యాక్ట్‌ కింద నమోదైన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘‘బాధితురాలిని పెళ్లి చేసుకుంటావా.. లేక జైలుకెళ్తావా’’ అని నిందితుడిని ప్రశ్నించింది. ఉద్యోగం నుంచి సస్పెండ్‌ కాకుండా ఉండాలన్నా.. జైలుకు వెళ్లకుండా ఉండాలన్న బాధితురాలిని వివాహం చేసుకోవాలని సూచించింది. నిందితుడు మోహిత్‌ సుభాష్‌ చవాన్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘నీవు పాఠశాల విద్యార్థినిపై అత్యాచారం చేశావ్‌. ఇందుకు గాను నీమీద పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు అయ్యింది. ఒకవేళ నీవు బాధితురాలిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటే.. మేం నీకు సాయం చేయగలం. లేదంటే నీవు జైలుకెళ్తావ్‌.. అప్పుడు ఆటోమెటిగ్గా నీ ఉద్యోగం కూడా పోతుంది’’ అని కోర్టు నిందితుడికి తెలిపింది. 

దీనిపై చవాన్‌ స్పందిస్తూ.. ‘‘గతంలో నేను బాధితురాలిని వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చాను. కానీ ఆమె అంగీకరించలేదు. ప్రస్తుతం నేను తనను పెళ్లి చేసుకోలేను.. ఎందుకంటే ఇప్పుడు నాకు వివాహం అ‍య్యింది’’ అని కోర్టుకు తెలిపాడు. నిందితుడు చవాన్‌ మహారాష్ట్ర స్టేట్‌ ఎలక్ట్రిక్‌ ప్రొడక్షన్‌ కంపెనీలో టెక్నిషియన్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితం చవాన్‌ మైనర్‌ స్కూల్‌ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. దాంతో అతడిపై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు అయ్యింది. ప్రభుత్వ ఉద్యోగి కావడంతో పోలీసులు చవాన్‌ని అరెస్ట్‌ చేస్తే.. వెంటనే అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తారు. దాంతో అతడు అరెస్ట్‌ నుంచి రక్షణ కోరుతూ.. హై కోర్టుని ఆశ్రయించాడు. అక్కడ ఆశించిన ఫలితం రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 

చవాన్‌ బెయిల్‌ పిటిషన్‌ సందర్బంగా కోర్టు.. బాధితురాలిని వివాహం చేసుకుంటే.. జైలుకెళ్లాల్సిన అవసరంలేదని తెలిపింది. ఇక ఈ విషయంలో కోర్టు బలవంతం ఏం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ బాధితురాలిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా లేకపోతే.. రెగ్యూలర్‌ బెయిల్‌కు అప్లై చేసుకోవాలని కోర్టు సూచించింది. చవాన్‌కి నాలుగు వారాల పాటు అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది.

చదవండి: ఆ రిటైర్డు జడ్జి విచారణ ఎదుర్కోవాల్సిందే: సుప్రీంకోర్టు

మరిన్ని వార్తలు