సెక్షన్‌ 124ఏ అవసరమా..?

16 Jul, 2021 03:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  బ్రిటిష్‌ కాలం నాటి దేశద్రోహం చట్టాన్ని ఇప్పటికీ ఉపయోగిస్తుండటాన్ని, చాలా సందర్భాల్లో దీనిని దుర్వినియోగపర్చడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మహాత్మాగాంధీ, గోఖలే వంటి స్వాతంత్య్ర సమరయోధుల గొంతు నొక్కేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం ఈ దేశద్రోహం చట్టాన్ని ఉపయోగించిందని గుర్తు చేసింది. దీనికి సంబంధించిన ఐపీసీలోని 124ఏ సెక్షన్‌ను ఇంకా ఎందుకు రద్దు చేయలేదని, ఈ సెక్షన్‌ ప్రస్తుత కాలంలో అవసరమా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది.

ఈ సెక్షన్‌ రాజ్యాంగ చెల్లుబాటుపై విచారణ చేస్తామని స్పష్టం చేసింది. సెక్షన్‌ 124ఏ రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా, విశ్రాంత సైనికాధికారి మేజర్‌ జనరల్‌ ఎన్‌జీ వోంబట్కెరే దాఖలు చేసిన పిటిషన్‌లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ హృషీకేశ్‌రాయ్‌ల ధర్మాసనం గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది. విచారణ సమయంలో ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. ఈ దేశద్రోహం చట్టం బ్రిటిష్‌ వారి నుంచి వలస తెచ్చుకున్న చట్టంగా అభివర్ణించింది.

  ప్రభుత్వాలపై విద్వేషం పెరిగేలా చేసే ప్రసంగాలు లేదా భావ ప్రకటనలను బెయిల్‌కు వీల్లేని నేరంగా పరిగణిస్తూ, ఈ సెక్షన్‌ కింద జీవితకాల జైలుశిక్ష విధించే అవకాశముంది. ‘ఈ చట్టం వలసరాజ్యం నాటి చట్టం. స్వేచ్ఛను అణచివేయడానికి, గాంధీ, తిలక్‌ వంటి వారి గొంతు నొక్కేందుకు ఈ చట్టాన్ని బ్రిటిష్‌వారు ప్రయోగించే వారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఈ చట్టం అవసరమా?’ అని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. ఈ తరహా కేసులు సుప్రీంకోర్టులో వేర్వేరు ధర్మాసనాల వద్ద పెండింగ్‌లో ఉన్న విషయాన్ని కేకే వేణుగోపాల్‌ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఎడిటర్స్‌ గిల్డ్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌ వాదనలు వినిపిస్తూ.. 124ఏ రాజ్యాంగ విరుద్ధమే కాకుండా ఏ విధంగా దుర్వినియోగం అవుతుందో పిటిషన్‌లో వివరించామన్నారు.

ఈ సెక్షన్‌ను దుర్వినియోగం చేసిన కేసులే ఎక్కువని, కొయ్య మలచడానికి వడ్రంగికి రంపం ఇస్తే మొత్తం అడవినే నరికినట్లుగా ఉందంటూ జస్టిస్‌ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66ఏ రద్దు చేసినప్పటికీ ఇప్పటికీ కేసులు నమోదు చేస్తున్న అంశాన్ని సీజేఐ ఉదహరించారు. చట్టం దుర్వినియోగం అవడంతో పాటు కార్యనిర్వాహక వ్యవస్థకు జవాబుదారీతనం లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు. ఈ తరహా ఇతర కేసులు కూడా పరిశీలిస్తామన్న సీజేఐ.. అన్ని కేసులను ఒకే చోట విచారిస్తామన్నారు. కాలం చెల్లిన చట్టాలను చాలా వరకూ రద్దు చేస్తున్న కేంద్రం ఈ విషయాన్ని ఎందుకు పరిశీలించలేదని ధర్మాసనం ప్రశ్నించింది.

ఈ సెక్షన్‌ను కొట్టివేయాల్సిన అవసరం లేదని, చట్టపరమైన ప్రయోజనాల నిమిత్తం మార్గదర్శకాలు ఏర్పాటు చేస్తే సరిపోతుందని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ తెలిపారు. పిటిషనర్‌ ఆర్మీ మేజర్‌ జనరల్‌గా పనిచేశారని, ఆయన దేశం కోసం త్యాగం చేశారని, ఈ పిటిషన్‌ను ప్రేరేపిత పిటిషన్‌గా భావించలేమని ధర్మాసనం పేర్కొంది. ‘సెక్షన్‌ 124ఏ ను పేకాట ఆడేవారిపైనా ప్రయోగిస్తున్నారు. ప్రత్యర్థుల అణచివేతకు రాజకీయ నేతలు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రత్యర్థులపై సెక్షన్‌ 124ఏ ప్రయోగించేలా ఫ్యాక్షనిస్టులు ప్రవర్తిస్తున్నారు. బెయిల్‌ రానివ్వకుండా ఈ సెక్షన్‌తో బెదిరిస్తున్నారు’ అని జస్టిస్‌ రమణ వ్యాఖ్యానించారు. సెక్షన్‌ 124ఏ రద్దుపై వైఖరి తెలపాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
 

విపక్ష నేతల హర్షం
దేశద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను పలువురు విపక్ష నేతలు, పౌర సమాజ కార్యకర్తలు స్వాగతించారు. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. ఒకవైపు, ఈ చట్టం దుర్వినియోగమవుతోందంటూ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరోవైపు బుధవారం హరియాణాలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న 100 మంది రైతులపై దేశద్రోహం సహా పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా, స్వరాజ్‌ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు