-

ఉచితాలకు అడ్డుకట్ట వేద్దాం.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన

4 Aug, 2022 05:05 IST|Sakshi

మార్గాలపై మేధోమథనం చేయండి

విపక్షాలతో, సంస్థలతో చర్చించండి

న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు చేసే ఉచిత వాగ్దానాలు తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ‘‘వీటిని వ్యతిరేకించడానికి, పార్లమెంటులో చర్చించడానికి ఏ పార్టీ కూడా ఇష్టపడదు. ఇవి కొనసాగాలనే కోరుకుంటుంది. కాబట్టి ఈ పోకడకు అడ్డుకట్ట వేయడానికి ఏం చేయాలో కేంద్ర ప్రభుత్వంతో పాటు నీతి ఆయోగ్, ఫైనాన్స్‌ కమిషన్, ఆర్‌బీఐ వంటి సంస్థలు మేధోమథనం చేసి నిర్మాణాత్మక సూచనలివ్వాలి.

విపక్షాలను కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలి’’ అని సూచించింది. ఉచిత పథకాలను ప్రకటించే పార్టీల గుర్తింపును, వాటి ఎన్నికల గుర్తును రద్దు చేసేందుకు ఎన్నికల సంఘానికి అధికారాలు కల్పించాలంటూ అశ్వినీ ఉపాధ్యాయ్‌ అనే న్యాయవాది దాఖలు చేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మానసం బుధవారం విచారణ జరిపింది.

ఈ విషయంలో ఏమీ చేయలేమని మాత్రం కేంద్రం, ఎన్నికల సంఘం చెప్పొద్దని, కూలంకషంగా పరిశీలించి సలహాలివ్వాలని స్పష్టం చేసింది. పిల్‌లో లేవనెత్తిన అంశాలకు కేంద్రం కూడా మద్దతిస్తోందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చెప్పారు. ‘‘ప్రజాకర్షక పథకాలతో ఇష్టారీతిన ఉచితాల పంపకం మున్ముందు ఆర్థిక వినాశనానికి దారి తీస్తుంది. ఉచితాల ద్వారా తన కుడి జేబులోకి కొంత వస్తున్నా తర్వాత్తర్వాత ఎడమ జేబుకు ఎంత కోత పడుతుందో సగటు పౌరుడు ఎప్పటికీ అర్థం చేసుకోలేడు.

కనుక ఓటర్లు తమ ఓటు హక్కును తెలివిడితో ఉపయోగించుకునే వీల్లేకుండా పోతుంది’’ అంటూ ఆందోళన వెలిబుచ్చారు. ఈ అంశం ఈసీ పరిధిలోనిదని ఇప్పటిదాకా కేంద్రం చెబుతూ వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ అంశమై కేంద్రానికి సలహాలిచ్చేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలిస్తామని ధర్మాసనం సంకేతాలిచ్చింది. దీనిపై గురువారం కూడా విచారణ కొనసాగనుంది. 

మరిన్ని వార్తలు