ఆ ఆవాల వెనుక బలమైన కారణం ఉందా? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు   

2 Dec, 2022 05:27 IST|Sakshi

న్యూఢిల్లీ: జన్యుమార్పిడి చేసిన(జీఎం) ఆవాలను (హైబ్రిడ్‌ డీఎంహెచ్‌–11) మార్కెట్‌లో విడుదల చేయడం వెనుక బలమైన కారణం ఏమైనా ఉందా? అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశంలో జన్యుమార్పిడి విత్తనాలపై నిషేధం విధించాలని కోరుతూ సామాజిక కార్యకర్త అరుణా రోడ్రిగ్స్, ‘జీన్‌ క్యాంపెయిన్‌’ అనే ఎన్జీవో దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి, జస్టిస్‌ బీవీ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.

జన్యుమార్పిడి విత్తనాల గురించి మన దేశంలో రైతులకు పెద్దగా అవగాహన లేదని గుర్తుచేసింది. ఇలాంటి విత్తనాలతో నష్టాలు ఉంటాయన్న వాదనలు వినిపిస్తున్నాయని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి వాదనలు వినిపించారు. జన్యుమార్పిడి పంటలను సామాజిక కార్యకర్తలు, కొందరు నిపుణులు సిద్ధాంతపరమైన కారణాలతో వ్యతిరేకిస్తున్నారని, శాస్త్రీయ, హేతుబద్ధతతో కూడిన కారణాలతో కాదని చెప్పారు. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్‌ 7వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. డీఎంహెచ్‌–11 ఆవాలను సెంటర్‌ ఫర్‌ జెనెటిక్‌ మ్యానిప్యులేషన్‌ ఆఫ్‌ క్రాప్‌ ప్లాంట్స్‌∙అభివృద్ధి చేసింది.  

మరిన్ని వార్తలు