పెగసస్‌ ఆరోపణలు నిజమైతే.. తీవ్రమైన అంశమే

6 Aug, 2021 04:43 IST|Sakshi

నిఘాపై క్రిమినల్‌ కంప్లైంట్‌ చేశారా?

పిటిషనర్లను ప్రశ్నించిన సుప్రీంకోర్టు ధర్మాసనం

మరింత సమాచారం సేకరించి రావాలని సూచన

విచారణ పదో తేదీకి వాయిదా

న్యూఢిల్లీ:  పెగసస్‌ స్పైవేర్‌పై ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు, ఆరోపణలు నిజమే అయితే ఇది తీవ్రమైన అంశమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఈ స్పైవేర్‌తో ప్రత్యర్థులపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టిందని, ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ సీనియర్‌ జర్నలిస్టులు ఎన్‌.రామ్, శశికుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు ఇదే అంశంపై దాఖలైన ఇతర పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.

పెగసస్‌ ఉదంతంపై క్రిమినల్‌ ఫిర్యాదు చేయడానికి ఏవైనా ప్రయత్నాలు సాగించారా? అని పిటిషనర్లను ప్రశ్నించింది. 2019 మే నెలలోనే పెగసస్‌ విషయం బయటపడిందని, అలాంటప్పుడు ఇప్పుడే దీన్ని ఎందుకు తెరపైకి తీసుకొస్తున్నారని అడిగింది. ఈ అంశంలో ప్రధానమంత్రిని సైతం కక్షిదారుగా చేర్చాలన్న పిటిషనర్ల వినతిని న్యాయస్థానం తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వానికి నోటీసు ఇవ్వడాన్ని స్వల్పకాలంపాటు నిలిపివేసింది.

కోర్టుకు సమర్పించిన వినతులను కేంద్రానికి సైతం అందజేయాలని పిటిషనర్లకు సూచించింది. తద్వారా ఆగస్టు 10న జరిగే తదుపరి విచారణకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరైనా ప్రతినిధిగా తమ ముందు హాజరవుతారని, అప్పుడు తాము నోటీసు జారీ చేస్తామని వెల–్లడించింది. పిటిషనర్లు ఎన్‌.రామ్, శశికుమార్‌ తరపున సీనియర్‌ అడ్వొకేట్‌ కపిల్‌ సిబల్‌ హాజరయ్యారు. పిటిషనర్లు ఉన్నత విద్యావంతులు, విషయ పరిజ్ఞానం ఉన్నవారేనని, పెగసస్‌ నిఘాపై వారు మరింత సమాచారం సేకరిస్తే బాగుండేదని ధర్మాసనం తెలిపింది.

పెగసస్‌పై తాము కొన్ని ప్రశ్నలు అడుగుతామని, ఇంకా సమాచారం సేకరించి, తదుపరి విచారణకు రావాలని పిటిషనర్లకు సూచించింది. ఈ విషయంలో ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదని తాము చెప్పడం లేదని, మీడియాలో వస్తున్న వార్తలు నమ్మశక్యం కానివని తాము భావించడం లేదని వెల్లడించింది. తమ ఫోన్లు హ్యాక్‌ అయ్యాయని కొందరు పిటిషనర్లు చెబుతున్నారని, వ్యక్తుల ఫోన్లపై ఎవరైనా నిఘా పెడితే టెలిగ్రాఫ్‌ చట్టం, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం కింద ఫిర్యాదు (క్రిమినల్‌ కంప్లైంట్‌) చేసే వెసులుబాటు ఉందని గుర్తుచేసింది. పెగసస్‌ వ్యవహారంపై వస్తున్న వార్తల్లో వాస్తవం ఉంటే ఇది తీవ్రమైన అంశం అనడంలో సందేహం లేదని తేల్చిచెప్పింది.

వ్యక్తుల గోప్యత, గౌరవంపై దాడి
పెగసస్‌ అనేది వంచన పరిజ్ఞానం (రోగ్‌ టెక్నాలజీ) అని కపిల్‌ సిబల్‌ సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధమేనని చెప్పారు. మనకు తెలియకుండానే మన జీవితాల్లోకి ఈ టెక్నాలజీ చొరబడుతుందని అన్నారు. పెగసస్‌ స్పైవేర్‌ను ఉపయోగించడం వ్యక్తుల గోప్యత, గౌరవంపై దాడి చేసినట్లే అవుతుందని స్పష్టం చేశారు. పెగసస్‌ స్పైవేర్‌ను ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయకపోతే వినియోగించడానికి వీల్లేదని చెప్పారు.

ఈ స్పైవేర్‌ను ఉపయోగించి, ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయని, అలాంటప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, ఎందుకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని నిలదీశారు. పెగసస్‌ వ్యవహారంపై ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందో చెప్పాలని డిమాండ్‌ చేశారు.  ఈ దశలో ప్రభుత్వం అంటే కేంద్రమే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే దీనిపై కోర్టుకు కేంద్ర ప్రభుత్వమే వివరణ ఇవ్వాల్సి ఉంటుందని సిబల్‌ బదులిచ్చారు. దేశ పౌరుల గోప్యత హక్కుకు సంబంధించిన  ఈ అంశంలో దర్యాప్తు అవసరమని మరికొందరు పిటిషనర్ల తరపున హాజరైన అడ్వొకేట్లు అరవింద్‌ దాతర్, మీనాక్షి అరోరా చెప్పారు.  

మరిన్ని వార్తలు