Lakhimpur Kheri Violence Case: ఆశిష్‌ మిశ్రాకు సుప్రీంకోర్టు షాక్‌.. కీలక ఆదేశాలు జారీ

19 Apr, 2022 04:39 IST|Sakshi

వారంలో లొంగిపోవాలన్న సుప్రీం

హైకోర్టు తీరుపై అసంతృప్తి

న్యూఢిల్లీ: లఖీంపూర్‌ఖేరీ ఘటనలో నిందితుడు ఆశిష్‌ మిశ్రా బెయిల్‌ను సుప్రీంకోర్టు సోమవారం రద్దు చేసింది. వారంలో లొంగిపోవాలని ఆదేశించింది. అలహాబాద్‌ హైకోర్టులో బాధితులకు సరైన న్యాయం జరగలేదని అభిప్రాయపడింది. ‘‘సాక్ష్యాలను కోర్టు హ్రస్వదృష్టితో వీక్షించింది. అసంబద్దమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలకు అనవసర ప్రాధాన్యమిచ్చింది’’ అంటూ చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘‘బెయిల్‌ మంజూరులో హైకోర్టు పరిధి దాటి వ్యవహరించింది. అసంబద్ధ అంశాలను పరిగణనలోకి తీసుకుంది. విచారణలో పాల్గొనేందుకు బాధితులకున్న హక్కును నిరాకరించింది.

బెయిలిచ్చేందుకు తొందర పడింది. వీటన్నింటినీ గమనించిన మీదట బెయిల్‌ను రద్దు చేస్తున్నాం’’ అని తెలిపింది. మిశ్రా మళ్లీ బెయిల్‌ కోరవచ్చని ధర్మాసనం చెప్పింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ దానిపై మూణ్నెల్ల లోపు హైకోర్టు సమగ్ర విచారణ జరపవచ్చని పేర్కొంది. యూపీలోని లఖీంపూర్‌ఖేరీలో గతేడాది అక్టోబర్‌లో రైతు నిరసనల సందర్భంగా నిరసనకారులపైకి కారు దూసుకుపోయిన ఘటనలో నలుగురు మరణించారు. ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గత ఫిబ్రవరిలో ఆయనకు బెయిల్‌ రాగా దాని రద్దు కోరుతూ బాధిత కుటుంబాలు సుప్రీంను ఆశ్రయించాయి.

బాధితులకు హక్కుంది
బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా తమ లాయర్‌ వీడియో కనెక్షన్‌ పోవడంతో వాదన విన్పించలేకపోయామన్న బాధితుల వాదనను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఈ విషయంలో హైకోర్టు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. క్రిమినల్‌ కేసుల్లో ప్రభుత్వం, నిందితుడి వాదనల ఆధారంగా తీర్పులిస్తారనే అభిప్రాయం ఇటీవలి దాకా ఉండేది. బాధితులకు ఈ విచారణలో భాగస్వామ్యం ఉండదన్నట్టుగా భావించేవారు. కానీ వారికీ విచారణలో పాల్గొనే హక్కుంటుంది’’ అని చేసింది.

ఈ కేసులో బాధితులకు సక్రమ హియరింగ్‌లో పాల్గొనే హక్కు లభించలేదని అభిప్రాయపడింది. బెయిల్‌ మంజూరు సమయంలో కోర్టులు ప్రాథమిక అంశాలను పరిశీలించవచ్చు. ప్రస్తుత కేసు తీవ్రతను, ఆరోపణలు రుజువైతే పడే శిక్ష తీవ్రతను, నిందితుడు పారిపోయే, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలను, అతని విడుదల సమాజంపై చూపే ప్రభావాన్ని అంచనా వేయడంలో హైకోర్టు హ్రస్వదృష్టితో వ్యవహరించింది. బెయిల్‌ మంజూరు మార్గదర్శకాలను నిర్లక్ష్యం చేసింది’’ అని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎఫ్‌ఐఆర్‌నే సర్వస్వంగా పరిగణించకూడదని హితవు పలికింది.

మంత్రి తప్పుకోవాలి: కాంగ్రెస్‌
ఆశిష్‌ బెయిల్‌ రద్దు నేపథ్యంలో ఆయన తండ్రి, కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా రాజీనామాను ప్రధాని మోదీ ఎప్పుడు కోరతా రని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. మోదీ ప్రభుత్వం రైతులను ఎన్నాళ్లు అణచివేస్తుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా ప్రశ్నించారు. రైతులపై అధికారుల సాక్షిగా అన్యాయం, దౌర్జన్యం జరుగుతున్నాయని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. వారికి న్యాయం కోసం అందరూ మద్దతివ్వాలన్నారు.

చదవండి: భారత్‌కు బ్రిటన్‌ ప్రధాని.. నేరుగా మోదీ సొంత రాష్ట్రంలోనే

మరిన్ని వార్తలు