‘స్త్రీలు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’

4 Sep, 2021 16:01 IST|Sakshi

ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ

న్యూఢిల్లీ: ‘‘లా అంటే నేటికి కూడా ధనవంతులు మాత్రమే చదవగలిగే కోర్సుగానే చూస్తున్నారు.. కాకపోతే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కొద్దిగా మార్పు వస్తుంది. అలానే న్యాయవాద వృత్తిని స్వీకరించే మహిళల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందన్నారు’’ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ. దేశంలోని పలు కోర్టుల్లో కనీస మౌలిక సౌకర్యాలు లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో కొత్తగా నియమితులైన తొమ్మిది మంది న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు.

అలానే హైకోర్టులలో ఉన్న ఖాళీల్లో 90శాతం పోస్టులను మరో నెల రోజుల వ్యవధిలో పూర్తిచేయనున్నట్లు ఎన్‌వీ రమణ తెలిపారు. ఎలాంటి వివాదం లేకుండానే కేవలం ఆరు రోజుల్లోనే సుప్రీంకోర్టుకు 9 మంది న్యాయమూర్తుల నియాకమానికి అనుమతులిచ్చినందుకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజుకి జస్టిస్‌ రమణ ధన్యవాదాలు తెలిపారు. కాగా  ఏడు దశాబ్దాల చరిత్రలో ఒకేసారి 9 మంది న్యాయమూర్తులు ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. 

ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్‌వీ రమణ మాట్లాడుతూ.. ‘‘లా కోర్సు అనగానే కేవలం ధనవంతులు మాత్రమే చదవగలిగేదిగా చూస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. అవకాశాలు పెరుగుతున్నాయి. న్యాయవాద వృత్తి నేటికి కూడా పట్టణ వాసులకు సంబంధించిన వృత్తిగానే మిగిలిపోయింది. ఎందుకంటే ఈ వృత్తిల్లో స్థిరంగా కొనసాగవచ్చు అని ఎవరూ హామీ ఇవ్వలేకపోతున్నారు. అందుకే న్యాయవాద వృత్తిని స్వీకరించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది’’ అన్నారు. అలానే కోర్టుల్లో మౌలిక సౌకర్యాలకు సంబంధించి ఎన్‌వీ రమణ.. కేంద్ర న్యాయ శాఖ మంత్రికి నివేదిక సమర్పించారు. (చదవండి: ఇదేం బాధ్యతారాహిత్యం)

ఈ సందర్భంగా ఎన్‌వీ రమణ కోర్టుల్లో మహిళా జడ్జీల సంఖ్య తక్కువగా ఉన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. ‘‘సుప్రీంకోర్టులో కేవలం 11 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారనే విషయాన్ని తెలియజేయడానికి చాలా చింతిస్తున్నాను. నేను హైకోర్టులో పని చేసే రోజుల్లో మహిళా జడ్జీల కోసం కనీసం టాయిలెట్స్‌ కూడా ఉండేవి కావు. నేను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాను’’ అన్నారు. దేశవ్యాప్తంగా పది హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా 68 మంది పేర్లను ఎన్‌వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే.   
(చదవండి: ఎకానమీ పురోగమిస్తోందన్న వార్తలు చదివాం!)

మరిన్ని వార్తలు