హైకోర్టు జడ్జిలుగా 68 మంది పేర్లు

4 Sep, 2021 04:12 IST|Sakshi

న్యూఢిల్లీ: వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా 68మంది పేర్లను సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేసింది. ఆగస్టు25, సెపె్టంబర్‌1న జరిపిన సమావేశాల్లో సీజేఐ జస్టిస్‌ రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కొలిజియం 112మంది పేర్లను పదోన్నతి కోసం పరిశీలించింది. ఇందులో 82మంది బార్‌కు చెందినవారు కాగా, 31మంది జ్యుడిషియల్‌ సర్వీసెస్‌కు చెందినవారు. వీరిలోనుంచి 68మంది పేర్లను 12 హైకోర్టులకు కొలిజియం రికమండ్‌ చేసింది. వీరిలో 44మంది బార్‌కు, 24 మంది  జ్యుడిషియల్‌ సర్వీసెస్‌కు చెందినవారు. ఈ దఫా సిఫార్సుల్లో కూడా కొలిజియం చరిత్ర సృష్టించింది.

తొలిసారి మిజోరాం నుంచి హైకోర్టు జడ్జి పదవికి ఒకరిని ఎంపిక చేసింది. మిజోరాంకు చెందిన ఎస్‌టీ జ్యుడిషియల్‌ అధికారి మర్లి వాంకుంగ్‌ను గౌహతి హైకోర్టుకు జడ్జిగా కొలిజియం రికమండ్‌ చేసింది. అలాగే సిఫార్సు చేసిన 68మందిలో 10మంది మహిళలున్నారు. ప్రస్తుతం సిఫార్సు చేసిన జడ్జిలను అలహాబాద్, రాజస్తాన్, కలకత్తా, జార్ఖండ్, జమ్ము కాశ్మీర్, మద్రాస్, మధ్యప్రదేశ్, కర్నాటక, పంజాబ్‌ అండ్‌ హర్యానా, కేరళ, చత్తీస్‌గఢ్, అస్సాం హైకోర్టుల్లో నియమిస్తారు. ఇటీవలే కొలిజయం ఏడుగురు జడ్జిలను తెలంగాణ హైకోర్టుకు, 9మందిని సుప్రీంకోర్టుకు రికమండ్‌ చేసింది. వీరందరితో ఒకేరోజు సీజేఐ ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో సుప్రీంలో జడ్జిల సంఖ్య 33కు చేరింది.  

మరిన్ని వార్తలు