SC Committee: ఈ–కోర్టుల మొబైల్‌ సేవలు

24 May, 2021 11:26 IST|Sakshi

తెలుగు సహా 14 భాషల్లో యాప్‌ విడుదల చేసిన సుప్రీంకోర్టు ఈ–కమిటీ  

సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కేసు స్థితిగతులు, ఇతరత్రా పలు అంశాలు తెలుసుకోవడానికి ‘ఈ–కోర్టుల సేవల మొబైల్‌ యాప్‌‘ మాన్యువల్‌ని 14 భాషల్లో సుప్రీంకోర్టు ఈ– కమిటీ విడుదల చేసింది. సామాన్యులకి కూడా అర్థమయ్యేలా స్క్రీన్‌ షాట్స్‌తో సహా వివరణాత్మకంగా ఉండేలా ఆంగ్లం, తెలుగు ఇతర ప్రాంతీయ భాషల్లో ఉచితంగా అందుబాటులో ఉండేలా రూపొందించిన ఈ మాన్యువల్‌ను సుప్రీంకోర్టు ఈ–కమిటీ ఛైర్మన్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఆదివారం విడుదల చేశారు. ఆంగ్లం, హిందీ, తెలుగు, అస్సామీ, బెంగాలీ,  గుజరాతీ, కన్నడ, ఖాసి, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, తమిళంలో ఈ మాన్యువల్‌ రూపొందించారు. న్యాయవాదులు, పౌరులు,  న్యాయ సంస్థలు, పోలీసు, ప్రభుత్వ సంస్థలు మరియు ఇతర సంస్థాగత న్యాయవాదుల ప్రయోజనం కోసం సుప్రీంకోర్టు ఇప్పటికే విడుదల చేసిన ‘‘ఈ–కోర్ట్స్‌ సర్వీసెస్‌ మొబైల్‌ యాప్‌’’ ఇప్పటివరకు 57 లక్షల డౌన్‌లోడ్‌లను దాటింది.

మొబైల్‌ యాప్‌ను, ఆంగ్ల, ప్రాంతీయ భాషల్లోని మాన్యువల్‌ను సుప్రీంకోర్ట్‌ ఆఫ్‌ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ నుండి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌... ఈ–మాన్యువల్, మొబైల్‌ యాప్‌  ప్రాముఖ్యత వివరించారు. ‘‘న్యాయ రంగంలో డిజిటల్‌ సంస్కరణలను ప్రవేశపెట్టడంలో సుప్రీంకోర్టు ఈ–కమిటీ ముందంజలో ఉంది. గత సంవత్సరంలో లాక్‌డౌన్,  ప్రజారోగ్య సమస్యల దృష్ట్యా కార్యాలయాలు మరియు కోర్టులను మూసివేయడం వల్ల రిమోట్‌గా పనిచేయడం, వర్చువల్‌ కోర్టులు, డిజిటల్‌ కార్యాలయాలు, ఎలక్ట్రానిక్‌ కేసు నిర్వహణ, చట్టపరమైన వృత్తిని ఎలా అభ్యసిస్తారు, ఎలా నిర్వహిస్తారు అనే అంశాల్లో సమగ్రంగా మార్పులు వచ్చాయి. సాంకేతికతను వాడటం వల్ల న్యాయ ప్రక్రియ మరింత సమర్థంగా పనిచేయడానికి, అందరికీ అందుబాటులో ఉండటానికి, పర్యావరణహితంగా పనిచేయడానికి వీలు కలుగుతుంది’’ అని జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు. మాన్యువల్‌ గురించి  న్యాయ శాఖ కార్యదర్శి బారున్‌ మిత్రా మాట్లాడుతూ.. న్యాయవాదులకు ఈ ఎలక్ట్రానిక్‌ కేస్‌ మేనేజ్‌మెంట్‌ టూల్స్‌ ఉపకరిస్తాయన్నారు.

ఈ–కోర్టు సేవల మొబైల్‌ అప్లికేషన్‌ ఉపయోగించి, కేసు సంఖ్యలు, సీఎన్‌ఆర్‌ నంబర్లు, ఫైలింగ్‌ నంబర్లు, పార్టీ పేర్లు, ఎఫ్‌ఐఆర్‌ నంబరు, అడ్వొకేట్‌ వివరాలు, చట్టాలు, మొదలైన కేసుల కోసం వివిధ పౌర–కేంద్రీకృత సేవలను పొందవచ్చు. కేసు స్థితి, విచారణ జరిపే కేసుల జాబితా వంటివి సెర్చ్‌ చేసుకోవచ్చు. కేసు వారీగా కేసు డైరీతో సహా దాఖలు చేసి విచారణ పూర్తయ్యేవరకూ పూర్తి వివరాలు పొందొచ్చు. మొబైల్‌ యాప్‌ నుండి ఆర్డర్లు / తీర్పు, కేసు వివరాలను బదిలీ చేయడం, మధ్యంతర దరఖాస్తు స్థితిని యాక్సెస్‌ చేయవచ్చు. ఈ–కోర్ట్స్‌ సేవల మొబైల్‌ యాప్‌ ద్వారా– హైకోర్టులు మరియు జిల్లా కోర్టుల కేసు స్థితి / కేసు వివరాలు కూడా పొందవచ్చు.  

(చదవండి: Corona virus: వేర్వేరు టీకాలు ఇవ్వొచ్చా!)

మరిన్ని వార్తలు