జమ్ము కశ్మీర్‌లో ‘బీజేపీ రాజ్యంగ విరుద్ధ చర్య!’: పిటిషన్‌ కొట్టివేత.. కేంద్రానికి భారీ ఊరట

13 Feb, 2023 14:20 IST|Sakshi

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌ నియోజకవర్గాల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. ప్రత్యేక కమిటీ ద్వారా నియోజకవర్గాల సంఖ్య పెంపు, సరిహద్దులు మార్పులు చేయడంపై అభ్యంతరాలు లేవనెత్తుతూ ‍ప్రతిపక్షాల తరపున దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఇవాళ (సోమవారం) కొట్టేసింది. 

జమ్ము కశ్మీర్‌లోని మొత్తం 90 అసెంబ్లీ, ఐదు లోక్‌సభ స్థానాల హద్దులను తిరగరాసింది డీలిమిటేషన్‌  కమిషన్‌. అయితే ఈ చర్య బీజేపీకి లాభం చేకూర్చేదిగా ఉందంటూ శ్రీనగర్‌కు చెందిన స్థానిక నేతలు  హాజీ అబ్దుల్‌ ఘనీ ఖాన్‌, ముహమ్మద్‌ అయూబ్‌ మట్టో.. సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

2019లో పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం ద్వారా.. ఆర్టికల్‌ 370 రద్దుతో జమ్ము కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను రద్దు చేయడంతో పాటు ఆ ప్రాంతాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే. అయితే కిందటి ఏడాది మే నెలలో జమ్ము అసెంబ్లీని 114 అసెంబ్లీ స్థానాలు(అందులో 24 పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌కు.. 43 జమ్ము రీజియన్‌కు, కశ్మీర్‌ లోయకు 47 సీట్లు..), కేటాయిస్తూ డీలిమిటేషన్‌ కమిషన్‌ ప్రతిపాదనలు చేసింది. అంతేకాదు.. పాక్‌ ఆక్రమిత జమ్ము కశ్మీర్‌ శరణార్థులకు, ఇద్దరు కశ్మీర్‌ వలసవాదులను సైతం  అసెంబ్లీకి నామినేట్‌ చేయాలని డీలిమిటేషన్‌ కమిషన్‌ సిఫార్సు చేసింది.     

అయితే.. 1971 జనాభా లెక్కల ప్రకారం.. దేశంలో 2026 ఏడాది వరకు నియోజకవర్గాలను పునర్వర్థస్థీకరించడానికి వీల్లేదని, పైగా కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత నియోజకవర్గాలను ఎలా మారుస్తారని.. కేంద్రంలోని బీజేపీది ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమని.. పిటిషన్‌దారులు సుప్రీం కోర్టులో వాదించారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం కశ్మీర్‌  ప్రత్యేక హోదాను జమ్ము కశ్మీర్‌ పునర్వవ్యస్థీకరణ చట్టం-2019 ప్రకారమే నిజయోకవర్గాల కోసం కమిటీ ఏర్పాటు చేసినట్లు వాదించింది. దీంతో కేంద్రం వాదనతోనే ఏకీభవించింది సుప్రీం కోర్టు. ఈ ఏడాదిలో.. కుదరకుంటే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు జమ్ము కశ్మీర్‌కు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు