అనవసరంగా ఉన్నతాధికారుల్ని వేధించినట్లే: సుప్రీంకోర్టు

8 Apr, 2021 10:54 IST|Sakshi

అధికారులకి తరచూ సమన్లు

న్యూఢిల్లీ: ప్రభుత్వంలో ఉన్నతాధికారుల్ని తరచుగా కోర్టుకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేయడాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించింది. కింది కోర్టులు, హైకోర్టులు చీటికి మాటికి ప్రభుత్వ అధికారుల్ని కోర్టుకు హాజరుకావడం సరైన పని కాదని పేర్కొంది. అలా చేయడం అధికారుల్ని వేధించడం కిందకే వస్తుందని వ్యాఖ్యానించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఇవ్వాల్సిన వేతన బకాయిలకు సంబంధించిన కేసులో ప్రభుత్వ అధికారులు ఇద్దరు కోర్టుకు హాజరు కావాలంటూ అలహాబాద్‌ సింగిల్‌ జడ్జి  తీర్పు చెప్పారు. ఈ కేసులో అంతకు ముందే హైకోర్టు స్టే విధించింది. ఆ తర్వాత అధికారులపై కోర్టు ధిక్కార చర్యలకు ఆదేశిస్తూ, వారిని కోర్టు ఎదుట హాజరుకావాలని మార్చి 2న అలహాబాద్‌ సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. 

ఈ క్రమంలో యూపీ సర్కార్‌ ఆ ఆదేశాలను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టుకెక్కింది. ఆ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్, హేమంత్‌ గుప్తాలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్‌ అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలను కొట్టేసింది. స్టే ఉన్న ఒక కేసులో అధికారులు హాజరు కావాలని ఆదేశించడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. న్యాయస్థానానికి అధికారం ఉంది కదాని తరచూ ప్రభుత్వ అధికారుల్ని కోర్టుకు రమ్మనకూడదని సుప్రీం కోర్టు పేర్కొంది. ఆ అధికారాన్ని వినియోగించడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అలహాబాద్‌ హైకోర్టుకి హితవు పలికింది. ఇలా తరచూ అధికారులకి సమన్లు జారీ చేయడం అంటే అనవరంగా వారిని వేధించడ మేనని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.

చదవండి: భూకుంభకోణం: ముఖ్యమంత్రికి భారీ ఊరట
సుప్రీంకోర్టుకు ‘ఇస్రో కుట్ర కేసు’ నివేదిక

మరిన్ని వార్తలు