న్యాయవాది కేసు ఓడిపోతే సేవాలోపం అనలేం

12 Nov, 2021 06:16 IST|Sakshi

అన్ని వేళలా పరిహారం కోరడం సమంజసం కాదు:  సుప్రీంకోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: న్యాయ సేవల్లో లోపం ఉందని ఆరోపిస్తూ ఎవరైనా పరిహారం నిమిత్తం వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించొచ్చని, అయితే అది అన్ని వేళలా సమంజసం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ ఉత్తర్వులు సవాల్‌ చేస్తూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఈ నెల 8న విచారించింది. ఓ కేసు విషయంలో ముగ్గురు న్యాయవాదుల వల్ల నష్టపోయానంటూ వినియోగదారుల ఫోరాన్ని ఓ వ్యక్తి సంప్రదించారు.

జాతీయ వినియోగదారుల ఫోరం కూడా సదరు వ్యక్తి అభ్యర్థన తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘‘జిల్లా, రాష్ట్ర, జాతీయ వినియోగదారుల ఫోరాలు పిటిషనర్‌ అభ్యర్థన తిరస్కరించడం సబబే. ప్రతి కేసులోనూ ఎవరో ఒకరు ఓడిపోవడం జరుగుతుంది. అంతమాత్రాన వినియోగదారుల ఫోరానికి వెళ్లి న్యాయవాది నుంచి పరిహారం ఇప్పించాలనడం సమంజసం కాదు. జరిమానా విధించకుండా పిటిషన్‌పై విచారణ ముగిస్తున్నాం’’ అని ధర్మాసనం పేర్కొంది. న్యాయవాది నిర్లక్ష్యం ఉందని బలమైన ఆధారాలుంటే తప్ప సేవాలోపంగా పేర్కొనలేమని స్పష్టం చేసింది.  

మరిన్ని వార్తలు