మీ నిరసనలతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి

2 Oct, 2021 05:02 IST|Sakshi

మళ్లీ సత్యాగ్రహానికి అనుమతులా?

రైతు సంఘాలను ప్రశ్నించిన సుప్రీం

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రైతు సంఘాలు చేస్తున్న ధర్నాలపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఢిల్లీలో జంతర్‌మంతర్‌ దగ్గర శాంతియుతంగా సత్యాగ్రహం చేయడానికి అనుమతినివ్వాలని రైతు సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ‘ఇప్పటికే మీ ధర్నాలతో ఢిల్లీ గళం నొక్కేశారు. ఇంకా నగరం లోపలికి కూడా వస్తారా?’అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నిరసన తెలిపే హక్కు ఉండొచ్చు. అదే సమయంలో పౌరులందరికీ నగరంలో స్వేచ్ఛగా, నిర్భయంగా తిరగడానికి సమాన హక్కులుంటాయి. వాటిని కాలరాయకూడదు’అని కోర్టు హితవు పలికింది. జస్టిస్‌ ఎఎం ఖాన్విల్కర్, జస్టిస్‌ సీటీ రవికుమార్‌ల ధర్మాసనం రైతులు చేస్తున్న ధర్నాలతో స్థానిక ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదో తెలుసుకున్నారా? అని ప్రశ్నించింది.

రైతుల నిరసనలతో ప్రజల ఆస్తులు ధ్వంసమవుతున్నాయని పేర్కొంది. రైతులు ఇప్పటికే సాగు చట్టాలను సవాల్‌ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, అలాంటప్పుడు మళ్లీ నిరసనలెందుకు? అని ప్రశ్నించింది. కోర్టులపై రైతులు నమ్మకం ఉంచాలని హితవు పలికింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హైకోర్టుని ఆశ్రయించిన రైతులు , దాని సత్వర విచారణకు మళ్లీ కోర్టుకి వెళ్లొచ్చని, ఇలా సత్యాగ్రహాలు చేయడం వల్ల ఒరిగేదేమిటని పేర్కొంది. శాంతియుతంగానే రైతులు నిరసన చేస్తారని రైతు సంఘాల తరఫున హాజరైన లాయర్‌ ప్రశ్నించగా ఆయనపై విరుచుకుపడింది. ‘శాంతియుతంగా నిరసనలంటే ఏమిటి? మీరు జాతీయ రహదారులను దిగ్బంధిస్తారు. రైళ్లను అడ్డుకుంటారు. ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తూ శాంతియుత నిరసనలంటే ఎలా?’అని బెంచ్‌ ప్రశ్నించింది. 

మరిన్ని వార్తలు