నకిలీ కోవిడ్‌ డెత్‌ సర్టిఫికెట్లపై సుప్రీం ఆందోళన

8 Mar, 2022 04:20 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కొందరు డాక్టర్లు నకిలీ కోవిడ్‌–19 డెత్‌ సర్టిఫికెట్లు జారీ చేస్తుండడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా కారణంగా మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న నష్ట పరిహారాన్ని కాజేయడానికి నకిలీ డెత్‌ సర్టిఫికెట్లు పుట్టుకొస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ బి.వి.నాగరత్నతో కూడిన ధర్మాసనం పేర్కొంది. నష్టపరిహారం కోరుతూ వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి నిర్ధిష్ట కాల వ్యవధి ఉండాలని సూచించింది. ఏకంగా డాక్టర్లే నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు ఇస్తుండడం తీవ్రమైన విషయమని ధర్మాసనం తెలిపింది. దీనివల్ల అసలైన బాధితులకు అన్యాయం జరుగుతుందని వెల్లడించింది. గౌరవ్‌ బన్సల్‌తోపాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. 

మరిన్ని వార్తలు