ప్రశాంత్‌ భూషణ్‌కు ఎదురుదెబ్బ

14 Aug, 2020 14:35 IST|Sakshi

‘‘తీవ్రమైన" ధిక్కారం: సుప్రీం

ఆగస్టు 20న శిక్ష ఖరారు

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌కు సుప్రీంకోర్టులోఎదురుదెబ్బ తప్పలేదు. ట్విటర్‌ వేదికగా ఉన్నత న్యాయస్థానం, న్యాయమూర్తులపై  అనుచిత వ్యాఖ్యలతో కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టుగా నిర్ధారించిన కోర్టు ప్రశాంత్ భూషణ్‌ను దోషిగా తేల్చింది. ‘‘తీవ్రమైన" ధిక్కారానికి పాల్పడినట్లుగా తేలిందంటూ సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. అనంతరం భూషణ్‌కు శిక్షపై విచారణను ఈ నెల 20 తేదీకి వాయిదా వేసింది.

సుప్రీంకోర్టు, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తికి, అంత‌కుముందు సీజేఐలుగా ఉన్న మరో నలుగురి గౌరవానికి భంగం కలిగించేలా  ఆయన  వ్యాఖ్యలు ఉన్నాయని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.  ఇవి కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని స్పష్టం చేస్తూ దోషిగా తేల్చింది.  దీనిపై ప్రశాంత్‌ భూషణ్‌కు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష లేదా  2000 రూపాయల వరకు జరిమానాతో లేదా రెండింటితో సాధారణ జైలు శిక్ష విధించవచ్చని భావిస్తున్నారు. కాగా కోర్టు ధిక్కరణ ఆరోపణలతో ప్రశాంత్‌ భూషణ్‌కు జూలై 22న షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుకు సమాధానమిస్తూ, వివరణాత్మక అఫిడవిట్‌ను  ప్రశాంత్‌ దాఖలు చేశారు.  దీన్ని ఆగస్టు 5 న విచారించిన కోర్టు తీర్పును రిజర్వు చేసిన సంగతి తెలిసిందే

మరిన్ని వార్తలు