సుప్రీంలోనూ గూగుల్‌కు ఎదురుదెబ్బ.. వారంలోగా పదిశాతం పెనాల్టీ కట్టాలని ఆదేశం

19 Jan, 2023 17:49 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇంటర్నెట్‌ సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌కు.. దేశ అత్యున్నత న్యాయస్థానంలోనూ ఊరట దక్కలేదు. గూగుల్‌కు వ్యతిరేకంగా కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(CCI) కొనసాగించిన దర్యాప్తులో ఎలాంటి లోటుపాట్ల లేవని సుప్రీం కోర్టు గురువారం స్పష్టం చేసింది. అంతేకాదు.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు(స్టే ఇచ్చేందుకు) నిరాకరించిన సుప్రీం కోర్టు.. నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ దగ్గరే తేల్చుకోవాలని గూగుల్‌కు సూచించింది. 

మరోవైపు గూగుల్‌ దాఖలు చేసిన అప్పీల్‌పై మార్చి 31వ తేదీలోగా తేల్చాలని ఎన్‌సీఎల్‌ఏటీ NCLAT ని ఆదేశించింది సుప్రీం కోర్టు. అంతేకాదు సీసీఐ విధించిన జరిమానాలో పది శాతాన్ని వారంరోజుల్లోగా డిపాజిట్‌ చేయాలని గూగుల్‌కు స్పష్టం చేసింది. 

భారత్‌లో గూగుల్‌ అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్‌కు పాల్పడుతోందని, ఆండ్రాయిడ్‌ మొబైల్‌ డివైజ్‌ల వ్యవస్థలో గుత్తాధిపత్యాన్ని గూగుల్‌ దుర్వినియోగం చేస్తోందని గుర్తించిన సీసీఐ.. గూగుల్‌కు రూ. 1,337 కోట్ల పెనాల్టీ విధించింది. ఈ ఆదేశాలపై స్టే విధించాలని నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట​ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించింది గూగుల్‌. అయితే.. సీసీఐ ఆదేశాలపై ఇంటీరియమ్‌ స్టేకు ఎన్‌సీఎల్‌ఏటీ కూడా నిరాకరించడంతో సుప్రీంను ఆశ్రయించింది గూగుల్‌. 

ఇక గూగుల్‌ పిటిషన్‌పై వాదనల సందర్భంగా.. ఇది జాతీయ స్థాయి ప్రాధాన్యతాంశమని సీసీఐ తరఫున వాదించిన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌ వెంకటరమణన్‌ బెంచ్‌కు తెలిపారు. ఈ వ్యవహారాన్ని భారత్‌ ఏ విధంగా పరిష్కరిస్తుందోనని ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోందన్నారు. అయితే ఎన్‌సీఎల్‌ఏటీకి మాత్రం మరోసారి పంపొద్దన్న ఆయన విజ్ఞప్తిని మాత్రం కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. మరోవైపు గూగుల్‌.. CCI ఆదేశాల వలన భారతదేశంలో పరికరాలు మరింత ఖరీదైనవిగా మారతాయని తెలిపింది. తద్వారా సురక్షితంకానీ యాప్స్‌ ద్వారా వినియోగదారులకు, జాతీయ భద్రతకు ముప్పు వాటిల్ల వచ్చని వాదించింది. 

ఇదిలా ఉంటే.. సీసీఐ గూగుల్‌ రెండు వేర్వేరు కేసుల్లో జరిమానా విధించింది. ఆండ్రాయిడ్‌ ఆధిపత్యానికి సంబంధించిన వ్యవహారంలో రూ.1,300 కోట్ల జరిమానా విధించింది. అంతేకాదు.. యాప్‌ డెవలపర్‌ల ఆంక్షలతో ఇబ్బంది పెట్టడం ఆపేయాలని, గూగుల్‌ ప్లే స్టోర్‌ బయటకూడా వాళ్ల యాప్‌లు అప్‌లోడ్‌ చేసుకునేందుకు అనుమతించాలని స్పష్టం చేసింది. అయితే గూగుల్‌ ఈ ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సీసీఐ ఆదేశాలను గనుక పాటిస్తే.. యాప్‌ డెవలపర్లు అధికంగా చెల్లింపులు చేయాల్సి వస్తుందని తెలిపింది. 

మరిన్ని వార్తలు