బిల్కిస్‌ బానో పిటిషన్‌.. ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటుకు సుప్రీం అంగీకారం

22 Mar, 2023 16:54 IST|Sakshi

ఢిల్లీ: గుజరాత్‌ అల్లర్ల అత్యాచార బాధితురాలు బిల్కిస్‌ బానో అభ్యర్థనకు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఎట్టకేలకు సానుకూలంగా స్పందించింది. ఆమె పిటిషన్‌ను విచారించేందుకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసేందుకు బుధవారం అంగీకరించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఈ మేరకు స్వయంగా బాధితురాలి తరపు న్యాయవాదికి ఈ విషయమై స్పష్టత ఇచ్చారు. 

బానో తరపున లాయర్‌ శోభా గుప్తా విజ్ఞప్తి మేరకు న్యాయస్థానం ఇందుకు అంగీకరించింది. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌తో పాటు జస్టిస్‌ పీఎస్‌ నరసింహా, జేబీ పార్దివాలాలతో కూడిన బెంచ్‌.. ఈ మేరకు బెంచ్‌ ఏర్పాటునకు అంగీకరించారు. ఈ కేసులో దోషులను రెమిషన్‌ మీద విడుదల చేయడం సరికాదు. ఈ(బానో) పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని, దానికి ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటు చేయల్సి ఉందని లాయర్‌ గుప్తా.. త్రిసభ్య ధర్మాసనాన్ని కోరారు. దీనికి ‘‘ నేను బెంచ్ ఏర్పాటు చేస్తా. సాయంత్రమే దాన్ని పరిశీలిస్తా’’ అని స్వయంగా సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, గుప్తాకు తెలిపారు. ఈ పిటిషన్‌తో పాటు నిందితుల విడుదలను సవాల్‌ చేస్తూ బానో ప్రత్యేకంగా మరో పిటిషన్‌ను సైతం సుప్రీంలో దాఖలు చేశారు. 

2002 గుజరాత్‌ అలర్ల సమయంలో.. బిల్కిస్‌ బానో దారుణంగా సామూహిక అత్యాచారానికి గురైంది. అదే అల్లర్లలో ఆమె కుటుంబ సభ్యులు సైతం హత్యకు గురయ్యారు. ఇక ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న పదకొండు మందిని.. గుజరాత్‌ ప్రభుత్వం  కిందటి ఏడాది ఆగష్టు 15వ తేదీన రెమిషన్‌ కింద విడుదల చేసింది.

దీనిని సవాల్‌ చేస్తూ గత డిసెంబర్‌లో బిల్కిస్‌ బానో సుప్రీంను ఆశ్రయించగా.. ఆ అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇక.. ఈ ఏడాది జనవరి 24వ తేదీన సైతం ఆమె మరో పిటిషన్‌ దాఖలు చేయగా.. ఆ సమయానికి ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మరో పిటిషన్‌తో బిజీగా ఉండడం వల్ల ముందుకు కదల్లేదు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు