ధ్రువ పత్రాలు సరిగా పరిశీలించలేదు.. అందుకే

17 Feb, 2021 08:47 IST|Sakshi

ప్రవాస విద్యార్థినికి ఎంబీబీఎస్‌లో ప్రవేశం నిరాకరణ

సాక్షి, న్యూఢిల్లీ: ఒక ప్రవాస విద్యార్థినికి వైద్య విద్యలో ప్రవేశానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు వైద్య విద్యలో ప్రవేశం కల్పించాలంటూ కాళోజీ వైద్య విశ్వవిద్యాలయానికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టింది. విద్యార్హతలకు సంబంధించి విశ్వవిద్యాలయానికి అందజేసిన ధ్రువప త్రాల్లో స్పష్టత లేదని సుప్రీంకోర్టు తేల్చింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సవాల్‌ చేస్తూ కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం దాఖలు చేసిన పిటిషన్‌పై సమగ్ర విచారణ జరిపిన జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎస్‌.రవీంద్రభట్‌ల ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది.

అమెరికాలో 12వ తరగతి చదివిన శ్రీకీర్తిరెడ్డి అనే ప్రవాస విద్యార్థిని నీట్‌కు అర్హత సాధించి 2020–21 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్‌లో ప్రవేశానికి దర ఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం అమెరికాలో 12వ తరగతి స్థాయిలో బయోలజీ చదివినట్లుగా ఆధారాలు లేవని కాళోజీ వర్సిటీ ప్రవేశానికి నిరాకరించింది. వర్సిటీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అమెరికాలో 12వ తరగతి రాష్ట్రంలో ఇంటర్‌తో సమానమంటూ  ఇంటర్‌ బోర్డు, న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌ జనరల్‌ ఇచ్చిన ధ్రువపత్రాలను ఆమె కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీటిని పరిశీలించిన తెలంగాణ హైకోర్టు కీర్తిరెడ్డికి ఎంబీబీఎస్‌లో ప్రవేశం కల్పించాలంటూ ఆదేశాలిచ్చింది. ధ్రువ పత్రాలు, విషయ నిబంధనలను నిశితంగా పరిశీలించలేదని పేర్కొంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలను పక్కన పెడుతూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

చదవండి: లక్షల కోట్లకన్నా గోప్యతే ముఖ్యం

మరిన్ని వార్తలు