ఆస్తుల జప్తుతో ప్రయోజనం లేదు

26 Aug, 2021 05:51 IST|Sakshi

దర్యాప్తులో అసాధారణ జాప్యంపై అసంతృప్తి

ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై యోచిస్తాం 

ప్రజా ప్రతినిధులపై కేసుల్లో సుప్రీంకోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాప్రతినిధులపై నమోదు చేస్తున్న కేసుల్లో ఆస్తుల జప్తుతో ప్రయోజనం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. సీబీఐ, ఈడీ సంస్థల దర్యాప్తులు నత్తనడక సాగుతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం దర్యాప్తు జాప్యానికి తగిన కారణాలు తెలపడం లేదని పేర్కొంది. ప్రజాప్రతినిధులపై దాఖలైన కేసులు త్వరితగతిన విచారించాలంటూ న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. పది పదిహేనేళ్లు గడిచినా ఛార్జిషీటు దాఖలు చేయనందుకు దర్యాప్తు సంస్థలు తగిన కారణాలు చెప్పడం లేదని పేర్కొంది.

‘‘మాజీలు సహా 51 మంది ఎంపీలు మనీల్యాండలింగ్‌ కేసులో నిందితులు. 28 కేసులు ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నాయి. ఆయా కేసులు సుమారు ఎనిమిది పదేళ్ల నాటివి. 121 సీబీఐ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 58 కేసులు ఉరి లేదా జీవితఖైదు శిక్ష విధించతగినవి. 2010 నుంచి కూడా కేసు పెండింగ్‌ ఉంది. 37 కేసుల్లో  సీబీఐ ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది. దర్యాప్తు సంస్థలను నిలదీయాలని మా ఉద్దేశం కాదు. దర్యాప్తు సంస్థల తీరుపై మేము ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడం లేదు. అలాచేస్తే వారి నైతికస్థైర్యం దెబ్బతింటుంది. వారిపైనా న్యాయమూర్తుల మాదిరి భారం ఉంది. ఎంత సంయమనం పాటించినా నివేదికలు నిలదీస్తున్నాయి’’ అని సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ అన్నారు. ఛార్జిషీట్లు దాఖలు చేయకుండా ఆస్తులు జప్తు చేసి ఏం ప్రయోజనం ఉంటుందని సీజేఐ ప్రశ్నించారు.  

చాలా ఈడీ కేసుల్లో విదేశాల నుంచి స్పందన అవసరమని, సమాచారం సమయానికి అందడం లేదని, తద్వారా దర్యాప్తు జాప్యం అవుతోందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలిపారు. దర్యాప్తు... కేసుల విచారణ వేగవంతం చేయండని చెప్పడం చాలా సులభమని, కానీ తగినంతగా న్యాయమూర్తులు లేరని సీజేఐ పేర్కొన్నారు. న్యాయమూర్తుల మాదిరే దర్యాప్తు సంస్థలు కూడా మానవ వనరులు లేక ఇబ్బందులు పడుతున్నాయని, ప్రతి ఒక్కరూ సీబీఐ దర్యాప్తు కోరుతున్నారని సీజేఐ వ్యాఖ్యానించారు. దర్యాప్తులో జాప్యాన్ని తగ్గించడానికి ఓ పాలసీ రూపొందించాలని అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులు, మౌలిక సదుపాయాల ఏర్పాటు సమస్యగా ఉందన్న సీజేఐ దీని పరిష్కారం నిమిత్తం ప్రత్యేక కోర్టుల ఏర్పాటు దిశగా యోచిస్తామని పేర్కొన్నారు.  దురుద్ధేశాలతో పెట్టిన కేసులను ఉపసంహరించే హక్కు రాష్ట్రాలకు ఉందని, అలాంటి కేసులను ఎత్తివేయవద్దని తాము చెప్పడం లేదని ధర్మాసనం పేర్కొంది. అయితే ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణకు ప్రభుత్వాలు సంబంధిత హైకోర్టుకు తగిన కారణాలను వివరించాలంది.

మరిన్ని వార్తలు