రూ.4 లక్షల నష్టపరిహారంపై సుప్రీం తీర్పు రిజర్వ్‌

22 Jun, 2021 07:36 IST|Sakshi

డెత్‌ సర్టిఫికెట్ల జారీని సులభతరం చేయాలని ప్రభుత్వానికి ఆదేశం

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 వల్ల మరణించినవారి కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ పిటిషన్లపై జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాతో కూడిన ప్రత్యేక ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, పిటిషనర్ల తరఫున సీనియర్‌ అడ్వొకేట్‌ ఎస్‌.బి.ఉపాధ్యాయ తదితరులు వాదనలు వినిపించారు. ఏ ప్రాతిపదికన పరిహారం ఇవ్వాలని కోరుతున్నారో తెలియజేస్తూ మూడు రోజుల్లో రాతపూర్వకంగా వినతులు సమర్పించాలని పిటిషనర్లకు సూచించింది.

కరోనా కారణంగా మృతిచెందిన వారి డెత్‌ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో వారి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని పేర్కొంది. కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించలేమంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందంటూ కేంద్రం చేతులెత్తేసింది. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌–2005 లోని సెక్షన్‌ 12(3) ప్రకారం విపత్తుల వల్ల చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వం నుంచి పొందే హక్కు ఉందని పిటిషనర్లలో ఒకరైన అడ్వొకేట్‌ గౌరవ్‌కుమార్‌ బన్సల్‌ పేర్కొన్నారు.

పరిహారం ఇవ్వొద్దని ఎన్‌డీఎంఏ నిర్ణయించిందా? 
కరోనా మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించవద్దని ప్రధానమంత్రి నేతృత్వంలోని నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ(ఎన్‌డీఎంఏ) నిర్ణయం తీసుకుందా? అని సుప్రీంకోర్టు సోమవారం కేంద్రాన్ని ప్రశ్నించింది. బాధిత కుటుంబాల ఆవేదనను పట్టించుకోవాలని, ఏకరూప పరిహార పథకానికి రూపకల్పన చేయడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు సూచించింది. కరోనా వల్ల జనం ఎదుర్కొంటున్న సమస్యలపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘మానవత్వం నశించిపోతున్నప్పుడు, ఔషధాల బ్లాక్‌ మార్కెటింగ్‌ వంటివి విచ్చలవిడిగా సాగుతున్నప్పుడు ఇంకేం చెప్పగలం. సామాన్య ప్రజల కష్టనష్టాలకే మా తొలి ప్రాధాన్యం’’ అని వెల్లడించింది. 

కాటికాపరులకు బీమా!
కోవిడ్‌ బారినపడి మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహించే కాటికాపరులకు బీమా వర్తింపజేసే అంశాన్ని పరిశీలించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఇలాంటి బీమా సౌకర్యాన్ని ఇప్పటికే కల్పిస్తున్నట్లు గుర్తుచేసింది. కరోనా బాధితుల మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తిచేస్తున్న కాటికాపరులు సైతం వైరస్‌ బారినపడుతున్నారని, కొందరు మరణించారని పిటిషనర్‌ గౌరవ్‌కుమార్‌ బన్సల్‌ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.

చదవండి: షాకింగ్‌ న్యూస్‌: దుష్టశక్తుల నుంచి రక్షణకు బాలిక కిడ్నాప్‌

మరిన్ని వార్తలు