దంపతులను కలిపిన సుప్రీంకోర్టు సీజే

29 Jul, 2021 04:29 IST|Sakshi

రెండు దశాబ్దాలుగా తేలని పంచాయితీ

సీజేఐ సూచనలతో ఒక్కటవుతామన్న తెలుగు దంపతులు 

సాక్షి, న్యూఢిల్లీ : రెండు దశాబ్దాలుగా న్యాయ పోరాటం చేస్తున్న దంపతులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి  సూచనలతో తిరిగి కలిసి కాపురం చేయనున్నారు. ఏపీ హైకోర్టు ఆదేశాలు సవాల్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది. ఈ సందర్భంగా దంపతులిద్దరితో ధర్మాసనం మాట్లాడే సమయంలో ఆంగ్లంలో మాట్లాడడానికి మహిళ ఇబ్బంది పడటం గమనించిన జస్టిస్‌ ఎన్‌వీ రమణ.. ఆమెను తెలుగులో మాట్లాడాలని సూచించారు. ‘మీ భర్త జైలుకు వెళ్లడం వల్ల ఉద్యోగం, వేతనం కోల్పోతారు. అదే సమయంలో నెలానెలా వచ్చే భరణం మీరు కోల్పోతారు’ అని జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు.

సీజేఐ సూచన అనంతరం భర్తతో కలిసి ఉండడానికి ఆ మహిళ అంగీకరించారు. అనంతరం, భార్యభర్తలు ఇద్దరూ వేర్వేరుగా తామిద్దరూ కలిసి ఉంటామంటూ రెండు వారాల్లో అఫిడవిట్లు దాఖలు చేయాలని జస్టిస్‌ ఎన్‌వీ రమణ సూచించారు. ఈ దంపతులకు 1998లో వివాహం అయింది. 2001లో వేధింపులకు సంబంధించి భర్తపై క్రిమినల్‌ కేసు దాఖలు చేశారు. ట్రయల్‌ కోర్టు 2002లో మహిళ భర్తకు 498 (ఏ) వరకట్న వేధింపులు ప్రకారం జైలు, జరిమానా విధించింది. మహిళ అత్త, మరదలకు కూడా అదే శిక్ష విధించింది. భర్త రివిజన్‌కు వెళ్లగా కోర్టు ట్రయల్‌ కోర్టు తీర్పునే సమర్థించింది. అనంతరం హైకోర్టుకు వెళ్లగా జైలు శిక్షను మినహాయిస్తూ తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పు సవాల్‌ చేస్తూ ఆమె తన భర్తకు జైలు శిక్ష వేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

మరిన్ని వార్తలు