‘బ్యాండ్‌ లేని లాయర్‌.. బ్యాట్‌ లేని టెండూల్కర్‌ ఒక్కటే’.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

1 Sep, 2022 20:33 IST|Sakshi

న్యూఢిల్లీ: కోర్టులో వాదించే న్యాయవాదులు, తీర్పులు చెప్పే న్యాయమూర్తులు నల్ల కోట్‌ ధరించి ఉంటారు. కోర్టుకు హాజరయ్యే సమయంలో ఏ విధంగా డ్రెస్‌ చేసుకోవాలనే అంశంపై కొన్ని నిబంధనలు ఉంటాయి. ఈ విషయంపై సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వద్ద జరిగిన ఓ సంఘటన చర్చనీయాంశంగా మారింది. ఓ యువ న్యాయవాది బ్యాండ్‌(టై) ధరించకుండా కోర్టు విచారణకు హాజరయ్యారు. వాదనలు వినిపించే సమయంలో బ్యాండ్‌ ధరించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ లాయర్‌కు కీలక సూచనలు చేశారు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌. ‘కోర్టులో ధరించవద్దు.. అది చాలా అసహ్యంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు.

‘మీ కళాశాలలో నమూనా కోర్టు నిర్వహించాల్సింది. దీనిని నమూనా కోర్టుగా భావించు. లంచ్‌కు వెళ్లేందుకు మాకు 10 నిమిషాల సమయం ఉంది. అన్ని వివరాలను తెలుసుకుని వాదనలు వినిపించు. నీవు వాదించగలవని అనుకుంటున్నాం. మీ సీనియర్‌ గైర్హాజరైనప్పుడు వాదనలు వినిపించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక న్యాయవాది బ్యాండ్‌(టై) లేకుండా రావటం.. బ్యాటు లేకుండా క్రికెట్‌ గ్రౌండ్‌లోకి సచిన్‌ టెండూల్కర్‌ రావటం ఒక్కటే.’ అని పేర్కొన్నారు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌. అయితే, ఒక యువ న్యాయవాదికి  జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సలహాలు ఇవ్వటం ఇదేం మొదటిసారి కాదు. గత ఏడాది ఓ యువ న్యాయవాది కోర్టుకు సమర్పించాల్సిన రాతపూర్వక పత్రాన్ని తీసుకురాకపోవటంతో పలు సూచనలు చేశారు.

ఇదీ చదవండి: ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం కోటాపై సుప్రీంకోర్టులో విచారణ

మరిన్ని వార్తలు