-

ప్రధాని తప్పు చేస్తే.. చర్యలు తీసుకునే సత్తా ఉన్న సీఈసీ కావాలి: సుప్రీం కోర్టు

23 Nov, 2022 16:00 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ ప్రధాన మంత్రిపై సైతం చర్యలు తీసుకునేంత సత్తా ఉన్న ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ప్రస్తుతం మన దేశానికి అవసరమని దేశ సర్వోత్తమ న్యాయస్థానం అభిప్రాయపడింది. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తుల ఎంపిక సరైందంటూ అభిప్రాయపడింది సుప్రీం కోర్టు. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి.. ఎన్నికల కమిషనర్ల నియామకానికి ప్రస్తుతం నడుస్తు‍న్న వ్యవస్థ సరికాదని.. కొలీజియంలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో.. బుధవారం విచారణ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలే చేసింది బెంచ్‌. 

ప్రధాన మంత్రికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునే ప్రధాన ఎన్నికల కమిషనర్‌ మనకు అవసరం. ఉదాహరణకు.. ప్రధానికి వ్యతిరేకంగా ఆరోపణలు వచ్చాయనుకుందాం. ఆ సమయంలో సీఈసీ  చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సీఈసీ గనుక బలహీనంగా ఉంటే ఎలాంటి చర్యలు తీసుకోలేరు కదా అని జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ హృషీకేశ్‌ రాయ్‌, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. 

చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ అనే ఉన్నత స్థానం రాజకీయ ప్రభావం నుంచి రక్షించబడాలి. స్వతంత్రంగా ఉండాలి. కానీ, అలా జరగడం లేదు. ఇది పూర్తిగా వ్యవస్థ విచ్ఛిన్నం కాదా అని కేంద్రం తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఎన్నికల కమిషనర్‌ నియామకంలో అనుసరిస్తున్న యంత్రాంగాన్ని తమకు చూపాలని కేంద్రం తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వం తరపున వాదిస్తున్న అటార్నీ జనరల్‌ & బృందం వివరణలు ఇచ్చుకుంది. కేంద్ర మంత్రివర్గం సలహా మేరకు ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమించాలని రాజ్యాంగంలో ఉందని, ఇంతవరకు అదే అమలవుతోందని ఏజీ ఆర్‌.వెంకటరమణి బెంచ్‌కు వివరించారు. 

అంతకు ముందు మంగళవారం వాదనల సందర్భంగా.. సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.  సున్నితంగా ఉండే ఎన్నికల సంఘం భుజాలపై అపారమైన అధికారాలను రాజ్యాంగం మోపిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సర్వోత్తముడైన వ్యక్తిని ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించేలా ఓ వ్యవస్థను రూపొందించాలని కేంద్రానికి సూచించింది. ఈ క్రమంలో మాజీ సీఈసీ టీఎన్‌ శేషన్‌ను గుర్తు చేస్తూ.. అలాంటి గట్టి వ్యక్తి, సం‍స్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.  సమర్థతే కాకుండా దృఢమైన వ్యక్తిత్వం ఉన్నవారిని సీఈసీగా నియమించేందుకు సరైన విధానం రూపొందించాలని అటార్నీ జనరల్‌ (ఏజీ) ఆర్‌.వెంకటరమణికి సూచించింది. 

ఏజీ వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన బెంచ్‌.. 2004 నుంచి ఒక్క సీఈసీ కూడా ఆరేళ్ల పదవీ కాలాన్ని పూర్తిచేయలేదని తెలిపింది. యూపీఏ, ఎన్డీయే హయాంలో సీఈసీలు మారిన విషయాన్ని గుర్తు చేసింది. అందువల్ల దృఢమైన వ్యక్తులను నియమించేందుకు స్పష్టమైన విధానం ఉండాలని అభిప్రాయపడింది. ఎన్నికల కమిషనర్ల నియామకానికి కొలీజియంలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ పిల్‌ దాఖలైంది గతంలో. ఈ పిల్‌ను అక్టోబర్‌ 2018లో సీఈసీ, ఈసీలతో కూడిన ఐదుగురు జడ్జిల బెంచ్‌కు సిఫార్సు చేసింది. అయితే కేంద్రం మాత్రం అలాంటి వ్యవస్థ అవసరం లేదంటూ వాదిస్తూ వస్తోంది.

ఇదీ చదవండి: మోర్బీ విషాదం.. తుప్పుపట్టిన కేబుళ్లు, వదులైన బోల్టులు!!

మరిన్ని వార్తలు